కల్కి అలంకారంలో కోనేటిరాయుడి వైభవం

ABN , First Publish Date - 2021-10-15T04:45:08+05:30 IST

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దర్శనమిచ్చారు.

కల్కి అలంకారంలో కోనేటిరాయుడి వైభవం
సర్వభూపాలవాహనంలో కొలువుదీరిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి

ముగిసిన వాహన సేవలు

నేటి ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు 


తిరుమల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి  కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. రంగనాయక మండపంలో ఉత్సవమూర్తికి కల్కి అలంకారం చేసి తిరుచ్చిపై ఊరేగింపుగా కల్యాణోత్సవ మండపానికి తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన అశ్వవాహనంపై కొలువుదీర్చి వాహనసేవ వైదిక కార్యక్రమాలైన దివ్యప్రబంధం, వేదపారాయణం, శాత్తుమొర, నైవేద్యం, హారతులు సమర్పించారు.దీంతో వాహన సేవలు పూర్తయ్యాయి.ఈ అశ్వవాహనసేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లి, ఏపీ హైకోర్టు ప్రఽధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు లలిత కుమారి, సత్యనారాయణ, చత్తీస్‌ఘడ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమరాజన్‌, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువారం ఉదయం 7 గంటలకు మహా రథోత్సవ స్థానంలో సర్వభూపాల వాహనసేవను నిర్వహించారు. సాధారణంగా ఎనిమిదవరోజు ఉదయం అత్యంత  విశిష్టమైన మహా రథోత్సవాన్ని మాడవీధుల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే కొవిడ్‌ కారణంగా గతేడాది తరహాలోనే అన్ని వాహనసేవలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రథోత్సవ స్థానంలో సర్వభూపాలవాహన సేవను నిర్వహించారు. విశేష అలంకరణతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని సర్వభూపాల వాహనంలో వేంచేపు చేసి దివ్యప్రబంధం, వేదపారాయణం, శాత్తుమొర, నైవేద్యం, హారతులతో వైదిక కార్యక్రమాలు పూర్తిచేశారు. సర్వభూపాల వాహనాన్ని కూడా రథం రూపంలో అలంకరించడం  ఆకర్షణీయంగా నిలిచింది.బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానాన్ని ఆలయంలోనే నిర్వహించనున్నారు.సాయంత్రం బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణాన్ని నిర్వహిస్తారు.ఈ ఘట్టంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 



Updated Date - 2021-10-15T04:45:08+05:30 IST