జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఖేలో కబడ్డీ ఆడియో ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-12-15T07:20:38+05:30 IST

తిరుపతి వేదికగా జనవరి 5 నుంచి 9వ తేదీ వరకూ జరగనున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సంబంధించి ‘ఖేలో కబడ్డీ ఆడియో’ను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఖేలో కబడ్డీ ఆడియో ఆవిష్కరణ
సరదాగా కబడ్డీ ఆడుతున్న ఎమ్మెల్యే భూమన, కార్పొరేటర్లు, అధికారులు

తిరుపతి(కొర్లగుంట), డిసెంబరు 14: తిరుపతి వేదికగా జనవరి 5 నుంచి 9వ తేదీ వరకూ జరగనున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సంబంధించి ‘ఖేలో కబడ్డీ ఆడియో’ను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలోని నెహ్రూ లలితకళ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మేయర్‌ డాక్టర్‌ శిరీష, కమిషనర్‌ గిరీష, ఉపమేయర్‌ ముద్రనారాయణ, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నభూతో న భవిష్యత్‌ అన్న తరహాలో కబడ్డీ పోటీలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి వేదికగా క్రీడా పండుగను నిర్వహించడం అందరికీ గర్వకారణమన్నారు. 22రాష్ట్రాలకు చెందిన 39పురుష, మహిళాజట్లు వేర్వేరుగా పాల్గొంటున్నాయన్నారు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈవెంటని, మున్సిపాలిటీనే కాకుండా దాతల సహకారం తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మేయర్‌ డాక్టర్‌ శిరీష మాట్లాడుతూ కబడ్డీ పోటీల నిర్వహణకు అందరూ సహకరించాలన్నారు. కమిషనర్‌ గిరీష మాట్లాడుతూ దాతలు విరాళాలను చెక్కు, డీడీ, ఫోన్‌పే, గూగుల్‌పే రూపంలో అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అదనపు కమిషనర్‌ హరిత, ఉప కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చివరగా కాసేపు ఎమ్మెల్యే, మేయర్‌, కమిషనర్‌, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది కాసేపు కబడ్డీ ఆడుతూ సరదాగా గడిపారు. 

Updated Date - 2021-12-15T07:20:38+05:30 IST