ఏకాంతంగా కేదారగౌరీ వ్రతం

ABN , First Publish Date - 2021-11-02T06:23:24+05:30 IST

కేదారిగౌరీ వ్రతాన్ని కొవిడ్‌ నిబంధనలంటూ కారణం చూపి ఏకాంతంగా నిర్వహించాలని శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు నిర్ణయించారు.

ఏకాంతంగా కేదారగౌరీ వ్రతం

కొవిడ్‌ నిబంధనల అమలుపై భక్తుల ఆవేదన 


శ్రీకాళహస్తి, నవంబరు 1: మహిళలు భక్తిశ్రద్ధలతో దీపావళి రోజు జరుపుకునే కేదారిగౌరీ వ్రతాన్ని కొవిడ్‌ నిబంధనలంటూ కారణం చూపి ఏకాంతంగా నిర్వహించాలని శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు నిర్ణయించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాదిమందితో జరిగే సామూహిక రాహు-కేతు పూజలకు వర్తించని ఆంక్షలు ఇప్పుడెందుకు విధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 

శ్రీకాళహస్తీశ్వరాలయానికి నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకూ నిరంతరాయంగా ఆలయంలో రాహు-కేతు పూజలు సాగుతుంటాయి. పూజా మండపాల్లో కనీస భౌతికదూరం లేకుండా భక్తులు ఆశీనులై దోషపూజలు జరుపుకుంటున్నారు. ఇక్కడ కరోనా నిబంధనలు పాటించేవారే కన్పించరు. ఇటీవల ఆలయంలో ప్రారంభించిన ధర్మపథం కార్యక్రమంలో కూడా వేలాది భక్తులు పాల్గొన్నారు. 


పర్వదినాల్లోనే గుర్తొస్తాయా?

ముక్కంటి ఆలయంలో పర్వదినాల్లో జరిగే ఉత్సవాలకు మాత్రం కొవిడ్‌ నిబంధనలు వర్తింపజేయడంపై ముక్కంటి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కరోనా తీవ్రత అధికంగా ఉన్న పరిస్థితుల్లో అన్ని పర్వదినాల్లో ఉత్సవాలను, పూజలను నిషేధించారు. ఈ ఏడాది అన్ని రాజకీయ పార్టీల సమావేశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఎందుకనో సామూహిక పూజలకు మాత్రం అనుమతి లభించడం లేదు. ఇటీవల వరదరాజస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఏకాంతంగా నిర్వహించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముక్కంటి ఆలయంలో అన్నదాన సేవలు కూడా మొదలయ్యాయి. దూరప్రాంతాల నుంచి తరలి వచ్చే వేలాది మంది భక్తులు భోజనాలు చేస్తున్నారు. కానీ, సామూహిక కేదారి గౌరీ వ్రతం నిర్వహణలో కొవిడ్‌ నిబంధనలు తెరమీదకు తెచ్చారు. ఇకనైనా ముక్కంటి ఆలయ అధికారులు స్పందించి కేదారిగౌరీ వ్రతంపై నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భక్తులు కోరుతున్నారు.  

Updated Date - 2021-11-02T06:23:24+05:30 IST