వైసీపీ వర్గ పోరుతో అట్టుడికిన కలికిరి మండల సమావేశం

ABN , First Publish Date - 2021-12-19T06:50:19+05:30 IST

వైసీపీలో వర్గ పోరు మరోసారి బట్టబయలైంది.వైసీపీకి చెందిన కలికిరి సర్పంచు రెడ్డివారి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి అదే పార్టీకి చెందిన ఎంపీపీ నూర్జహాన్‌ లక్ష్యంగా విమర్శలు సంధించడంతో మండల సమావేశం అట్టుడికింది.

వైసీపీ వర్గ పోరుతో అట్టుడికిన కలికిరి మండల సమావేశం
ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ఆరోపణలతో గందరగోళంగా మారిన సమావేశం

కన్నీటి పర్యంతమై సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయిన ఎంపీపీ


కలికిరి,డిసెంబరు 18 : వైసీపీలో వర్గ పోరు మరోసారి బట్టబయలైంది.వైసీపీకి చెందిన కలికిరి సర్పంచు రెడ్డివారి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి అదే పార్టీకి చెందిన ఎంపీపీ నూర్జహాన్‌ లక్ష్యంగా విమర్శలు సంధించడంతో మండల సమావేశం అట్టుడికింది. ఎంపీపీ చదువుకు సంబంధించిన అంశంపై స్వపక్ష సభ్యుడు ప్రతాప్‌కుమార్‌ రెడ్డి సంధించిన ప్రశ్నల జడివానకు జవాబివ్వలేక నిస్సహాయురాలైన ఎంపీపీ నూర్జహాన్‌కు ఎంపీడీవో వెంకటేశులు మద్దతుగా నిలవడానికి విఫలయత్నం చేశారు. అయితే ప్రతాప్‌ రెడ్డి సభా నియమాలను ఏకరువు పెట్టడంతో ఆయన కూడా సర్దుబాటు చేయలేక మిన్నకుండిపోవలసి వచ్చింది. ఒక దశలో చదువు లేని వ్యక్తి పదవిలో కూర్చోకూడదని ఏ రాజ్యాంగంలోనూ లేదని ఎంపీపీకి మద్దతుగా ఎంపీడీవో మొండికెత్తారు. ఈ మొత్తం వ్యవహారానికి ఆమెకు భాష రాకపోవడం, చదువులేక పోవడం, సమర్థవంతంగా సభను నిర్వహించకపోవడమే కారణమని సభ్యుడు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఏ దశలోగానీ ఆ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలలో ఏ ఒక్కరుగానీ ఎంపీపీ నూర్జహాన్‌కు అండగా నిలబడకపోవడంతో సమావేశంలోనే ఆమె రెండు మూడు దఫాలు కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి చేసేది లేక అజెండాలోని ఒకే ఒక అంశం కూడా పూర్తి కాకుండానే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వెళ్ళిపోయారు.ఎంపీపీగా తగిన అభ్యర్థిని ఎంచుకోలేకపోయినందునే తమ పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని ప్రతాప్‌ రెడ్డి వాపోయారు.శనివారం జరిగిన మండల సమావేశాన్ని ప్రారంభంలోనే  ఎంపీపీ నూర్జహాన్‌ మాత్రమే నిర్వహించాలని కలికిరి సర్పంచు పట్టుబట్టారు. అయితే ఎంపీపీ సలహా మేరకు తాను అజెండాను చేపడుతున్నట్లు ఎంపీడీవో వెంకటేశులు చెప్పడంతో వివాదం మొదలైంది. ఎంపీడీవో జోక్యాన్ని ప్రతాప్‌కుమార్‌ రెడ్డి అడ్డుకోవడంతో ఎంపీపీకి చదువు రాదన్న విషయం చర్చకు దారి తీసింది. దీంతో ఆమెకు చదువు రాదని అంగీకరించాలని, లేదంటే సమావేశాన్ని ఆమే స్వయంగా నిర్వహించాలని ప్రతాప్‌ రెడ్డి పట్టుబట్టారు. పరిపాలన చేయాలంటే చదువు అవసరం లేదని ఒక దశలో ఎంపీపీ నూర్జహాన్‌ వాదనకు దిగేందుకు విఫలయత్నం చేశారు. అయితే ఆమెకు సభ్యుల నుంచి  మద్దతు లభించకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. అజెండాలో మొదటి అంశంగా రెవెన్యూపై చర్చ ప్రారంభమైనా సమావేశం ఆసాంతం రసాభాసగానే సాగింది. పార్టీ పెద్దల అనాలోచిత నిర్ణయాలతో మండల పాలనను సర్వనాశనం చేశారని, చదువు లేని పాలన ఎలా వుంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నామని ప్రతాప్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. చదువున్న సభ్యులు పార్టీలో ఎంతో మంది వున్నా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.ఎంపీపీ నిరక్షరాస్యత గురించి ప్రతాప్‌ రెడ్డి పదే పదే ప్రస్తావించడంతో తరువాత చేపట్టాల్సిన అజెండా అంశాలన్నీ మరుగున పడిపోయాయి. సమావేశంలోనే వున్న సీనియర్‌ సభ్యులు సింగిల్‌ విండో అధ్యక్షుడు నల్లారి శ్రీకర్‌ రెడ్డి, గుట్టపాళెం సర్పంచు వెంకట రెడ్డి తదితరులు కూడా వారించే ప్రయత్నం చేయకుండా నిర్లిప్తంగా జరుగుతున్న దాన్ని చూస్తూ మిన్నకుండిపోయారు. ఒక దశలో మొరంకిందపల్లె సర్పంచు అరుణకుమారి జోక్యం చేసుకుని ప్రతాప్‌ రెడ్డి అడుగుతున్న వాటికి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. దీంతో ఉపాథ్యక్షురాలు గాయత్రితో పాటు ఒకరిద్దరు సభ్యులు ఆయనకు మద్దతుగా వాదనలకు దిగారు. దాదాపు 30 మంది సభ్యులు, అదే స్థాయిలో అధికారులున్నా మద్దతు లేకపోవడంతో ఎంపీపీ అచేతనురాలయ్యారు. దీంతో సమావేశం అదుపులోకి వచ్చే పరిస్థితులు కనబడకపోవడంతో ఎంపీపీ నూర్జహాన్‌ హఠాత్తుగా లేచి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పేసి వెళ్ళిపోయారు.అనంతరం ఆమె పేరిట విడుదలైన ఒక ప్రకటనలో మైనారిటీ మహిళ అయిన తాను ఎంపీపీగా ఎన్నిక కావడం ఇష్టంలేకనే సర్పంచు ప్రతాప్‌కుమార్‌ రెడ్డి అడ్డంకులు కల్పిస్తున్నారని ప్రత్యారోపణలు చేశారు. ఆయన అనుకున్న అభ్యర్థికి వైసీపీ అధిష్ఠానం ఎంపీపీ పదవి ఇవ్వకపోవడం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భాషకు సంబంధించి కూడా తనను కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.    

Updated Date - 2021-12-19T06:50:19+05:30 IST