కులధృవీకరణ పత్రం ఇవ్వలేదని ఈసీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-06T06:51:28+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో భార్యతో పోటీ చేయించాలనుకున్న తనకు అధికారులు కులధృవీకరణ పత్రం మంజూరు చేయడం లేదని శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లెకు చెందిన హనుమంతు ఆరోపించారు.

కులధృవీకరణ పత్రం ఇవ్వలేదని ఈసీకి ఫిర్యాదు

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 5: పంచాయతీ ఎన్నికల్లో తన భార్యతో పోటీ చేయించేందుకు గాను రెవెన్యూ అధికారులు కులధృవీకరణ పత్రం మంజూరు చేయడం లేదని శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లెకు చెందిన హనుమంతు ఆరోపించారు. ఈ విషయమై శుక్రవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. మండలంలోని జగ్గరాజులపల్లె పంచాయతీ సర్పంచ్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన మహిళ ఒక్కరే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ మతం స్వీకరించిన తన పేరు డేనియల్‌ అనీ, బీసీ కులధ్రువీకరణ పత్రం ఇవ్వాలని హనుమంతు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. ఇటీవల ఆయన పిల్లలకు ఎస్సీ ధ్రువీకరణపత్రం మంజూరు చేసిన అధికారులు, బీసీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. జగ్గరాజుపల్లె పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి తన భార్య పోటీ పడుతోందనీ, దీంతో అధికారులు బీసీ కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడం లేదంటూ శుక్రవారం ఆయన ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనల మేరకు హనుమంతుకు ధ్రువీకరణ పత్రం ఎందుకు జారీ చేయరాదన్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాతపూర్వకంగా తెలియజేస్తున్నట్లు ఇన్‌చార్జి తహసీల్దార్‌ సుధీర్‌రెడ్డి చెప్పారు. 

Updated Date - 2021-02-06T06:51:28+05:30 IST