ఇదేం ఫీవర్‌ సర్వే..?

ABN , First Publish Date - 2021-05-21T06:08:14+05:30 IST

‘ఇదేం ఫీవర్‌ సర్వే..? కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సర్వేను నిర్వహించడం ఇలాగేనా..? ఎంత చెప్పినా మీ తీరులో మార్పు రాదా...?’’ అంటూ జాయింట్‌ కలెక్టరు వీరబ్రహ్మం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదేం ఫీవర్‌ సర్వే..?
ఫీవర్‌ సర్వేపై ప్రజలను అడిగి తెలుసుకుంటున్న జేసీ వీరబ్రహ్మం

 జేసీ వీరబ్రహ్మం ఆగ్రహం

శ్రీకాళహస్తి, మే20: ‘ఇదేం ఫీవర్‌ సర్వే..? కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సర్వేను నిర్వహించడం ఇలాగేనా..? ఎంత చెప్పినా మీ తీరులో మార్పు రాదా...?’’ అంటూ జాయింట్‌ కలెక్టరు వీరబ్రహ్మం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి పరిధిలో ఫీవర్‌ సర్వే సక్రమంగా నిర్వహించలేదనే కారణంతో వివిధ శాఖల ఉద్యోగులకు వేతనాలు నిలుపుదల చేస్తూ కలెక్టరు హరినారాయణన్‌ ఉత్తర్వులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకోవడానికి జాయింట్‌ కలెక్టరు వీరబ్రహ్మం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శ్రీకాళహస్తి పురపాలకసంఘం 20వ వార్డు పరిధిలోని కైలాసగిరి కాలనీలో కొన్ని ఇళ్లకు ఆయనే స్వయంగా వెళ్లి విచారించారు. ఫీవర్‌ సర్వేకోసం ఎవరూ తమ ఇళ్లకు రాలేదని స్థానికులు చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. పలు ఇళ్లలో విచారించినా ఆయనకు ఇదే సమాధానం లభించింది. శ్రీకాళహస్తి గ్రామీణ పరిఽధిలో కూడా ఇలాగే ఉన్నట్లు ఆయన విచారణలో తేలింది. దీంతో ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీవర్‌ సర్వే పారదర్శకంగా చేయకపోతే శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవని  ఆధికారులను హెచ్చరించారు. కొవిడ్‌ను కట్టడి చేయాలంటే క్షేత్రస్థాయిలో ఫీవర్‌ సర్వే పారదర్శకంగా చేయాలని... ఇళ్లలో కూర్చుని నివేదికలు పంపితే కుదరన్నారు. అధికారులు ఇకనైనా మేల్కొవాలని అదేశించారు. జేసీ వెంట శ్రీకాళహస్తి ఎంపీడీవో బాలాజీనాయక్‌, ఇన్‌చార్జి కమిషనరు వెంకట్రమణ, డిప్యూటీ తహసీల్దారు సుధీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-05-21T06:08:14+05:30 IST