ఇవేం ఎన్నికలు?

ABN , First Publish Date - 2021-03-04T06:33:16+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఫార్స్‌గా మారిపోయింది.ప్రతిపక్ష అభ్యర్థులకు తెలియకుండానే వారి నామినేషన్లు విత్‌ డ్రా అయ్యాయి. అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకులు మాత్రమే నామినేషన్‌ విత్‌ డ్రా చేయాల్సివుండగా ఆ నిబంధన చాలావరకూ అమలు కాలేదు. అభ్యర్థుల పేరిట అధికార పార్టీ నేతలే ఉపసంహరణ పత్రాలను తెచ్చివ్వగా అధికారులు వాటిని ఆమోదించేశారన్న ఫిర్యాదులున్నాయి.

ఇవేం ఎన్నికలు?
మదనపల్లెలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణుల ఆందోళన

 ఏకగ్రీవాల కోసం వైసీపీ కుయుక్తులు


 విపక్ష అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణలన్నీ వారి పరోక్షంలోనే!


తిరుపతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఫార్స్‌గా మారిపోయింది.ప్రతిపక్ష అభ్యర్థులకు తెలియకుండానే వారి నామినేషన్లు విత్‌ డ్రా అయ్యాయి. అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకులు మాత్రమే నామినేషన్‌ విత్‌ డ్రా చేయాల్సివుండగా  ఆ నిబంధన చాలావరకూ అమలు కాలేదు. అభ్యర్థుల పేరిట అధికార పార్టీ నేతలే ఉపసంహరణ పత్రాలను తెచ్చివ్వగా అధికారులు వాటిని ఆమోదించేశారన్న ఫిర్యాదులున్నాయి. 

చిత్తూరులో టీడీపీ నేతపై వైసీపీ దాడి

చిత్తూరు కార్పొరేషన్‌లో బుధవారం 205 నామినేషన్లు విత్‌ డ్రా అయ్యాయి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఉపసంహరణలకు అభ్యర్ధులు, వారి ప్రతిపాదకులూ రాలేదు. ఆయా డివిజన్లలోని వైసీపీ అభ్యర్థులు లేదా ఆ పార్టీ నేతలు ఉపసంహరణ పత్రాలను అధికారులకు అందజేశారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచీ 3 గంటల నడుమ ఈ డ్రామా నడిచింది. 20వ డివిజన్‌లో ఇరువారం ప్రాంతానికి చెందిన వైసీపీ రెబెల్‌ అభ్యర్థి, టీడీపీ అభ్యర్ధులు ఇద్దరి నామినేషన్లు వారికి తెలియకుండానే విత్‌ డ్రా అయ్యాయి. దీనిపై టీడీపీ ఎన్నికల పరిశీలకుడు గురజాల సందీప్‌కుమార్‌ గాయత్రి నగర్‌లోని సచివాలయంలోకి వెళ్ళి అధికారులను ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు ఆయనపై దాడిచేసి కొట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టడంతో సందీప్‌ కారెక్కి వెళ్ళిపోయారు. అనుప్పల్లెలో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచారని ప్రకటించడంతో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ ఎలా ఉపసంహరించారని గ్రామస్తులే వచ్చి గొడవకు దిగారు. 32వ డివిజన్‌లో వైసీపీ రెబెల్‌ ముత్తు కుమార్‌ తనకు తెలియకుండానే నామినేషన్‌ ఉపసంహరించారని ఆరోపించారు. చిత్తూరులో జరిగిన వైసీపీ రెబెల్‌, వైసీపీయేతర పార్టీల అభ్యర్థుల ఉపసంహరణలన్నీ ఫోర్జరీ సంతకాలతో జరిగినవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం నేత చైతన్య 26వ డివిజన్‌లో నామినేషన్‌ వేస్తే అతనికి కూడా తెలియకుండా ఉపసంహరణ జరిగిపోయింది. బీజేపీ రామభద్ర నామినేషన్‌ వేశాక అందుబాటులో వుంటే ఒత్తిళ్ళు వస్తాయన్న కారణంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే ఆయనకు తెలియకుండానే నామినేషన్‌ విత్‌ డ్రా అయిపోయింది.


తిరుపతిలోనూ తెలియకుండానే ఉపసంహరణలు

తిరుపతిలో బుధవారం 28 నామినేషన్లు విత్‌ డ్రా అయ్యాయి. ఇక్కడ కూడా వైసీపీయేతర అభ్యర్థుల విషయంలో వారికి తెలియకుండానే నామినేషన్లను విత్‌ డ్రా చేసినట్టు ఆరోపణలున్నాయి. 7వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి విజయ పేరుతో వైసీపీ వారు ఉపసంహరణ పత్రం ఇవ్వగా అధికారులు దాన్ని ఆమోదించారు. తర్వాత విషయం తెలుసుకున్న ఆమె 7వ డివిజన్‌ సచివాలయానికి వెళ్ళి అధికారులను నిలదీశారు. తనకు తెలియకుండా నామినేషన్‌ పత్రాలను ఎలా విత్‌ డ్రా చేస్తారంటూ గొడవకు దిగారు. సమాచారమందుకున్న టీడీపీ నాయకుడు నరసింహయాదవ్‌ అక్కడకు చేరుకుని అభ్యర్థికి మద్దతుగా ధర్నా చేపట్టారు. తనకు న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ అభ్యర్థి ఆల్టిమేటమ్‌ ఇవ్వడంతో  కమిషనర్‌ స్పందించారు.జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఎఫ్‌ఐఆర్‌ కాపీ తనకు అందజేస్తే ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపుతామంటూ సమాధానపరిచారు. అవసరమైతే సచివాలయంలోని సీసీ టీవీ ఫుటేజ్‌ కూడా అందజేస్తానంటూ ఊరడించారు. దీంతో టీడీపీ వర్గీయులు ఆందోళన విరమించారు. 26వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి అక్కినపల్లె మునికృష్ణయ్యను పోటీ నుంచీ తప్పుకోవాలని వైసీపీ వర్గీయులు తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. సమాచారమందుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌ అక్కడకు చేరుకుని వైసీపీ వర్గీయులను నిలదీయడంతో ఇరువర్గాల నడుమ తోపులాట జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినా వారు ప్రేక్షకపాత్ర వహించారు.

  

మదనపల్లెలో బీజేపీ, సీపీఐ ఆందోళన


మదనపల్లె మున్సిపాలిటీలో బుధవారం 54 నామినేషన్లు విత్‌ డ్రా అయ్యాయి. 26వ వార్డులో బీజేపీ అభ్యర్థి అంజన తనకు తెలియకుండా తన నామినేషన్‌ ఏ విధంగా ఉపసంహరించారంటూ అధికారులతో గొడవ పడ్డారు. విషయం తెలుసుకుని బీజేపీ నేతలు డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి, బండి ఆనంద్‌ అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల వైఫల్యంతోనే ఇలా జరిగిందంటూ వారిపై మండిపడ్డారు. కాగా 4వ వార్డులో సీపీఐ అభ్యర్థి మరియాంబీ నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోగా సమాచారమందుకున్న సీపీఐ నేతలు, కార్యకర్తలు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.తమ అభ్యర్థిని భయభ్రాంతులకు గురిచేసి పోటీ నుంచీ తప్పుకునేలా చేశారంటూ ఆరోపించారు. టీడీపీ అభ్యర్థుల బీఫారాలు తీసుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ను పోలీసులు మున్సిపల్‌ కార్యాలయంలోకి అనుమతించలేదు. ఆయన వారితో వాగ్వాదానికి దిగడంతో ఎట్టకేలకు అనుమతించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా మున్సిపల్‌ కమిషనర్‌ ఛాంబర్‌లో వుండగా కాంగ్రెస్‌ అభ్యర్థుల బీఫారాలతో మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేను లోపల కూర్చోబెట్టి తనను ఎలా అడ్డుకుంటారంటూ మాజీ ఎమ్మెల్యే వారిని నిలదీశారు.పోలీసుల అభ్యంతరాలు వినిపించుకోకుండా నేరుగా ఛాంబర్‌లోకి వెళ్ళి కూర్చున్నారు. దీంతో పోలీసులు ఇద్దరినీ వెలుపలికి పంపివేశారు. 


 పలమనేరులో 24 నామినేషన్ల ఉపసంహరణ

పలమనేరు మున్సిపాలిటీలో బుధవారం 24 నామినేషన్లు ఉపసంహరణకు గురయ్యాయి. బలవంతపు ఉపసంహరణలు జరిగినట్టు ఎక్కడా ఆరోపణలు, ఫిర్యాదులూ రాలేదు. కాగా 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ విత్‌డ్రా అయిందని ప్రచారం జరిగింది. దీంతో అభ్యర్థి భర్త టీడీపీ నేత నాగరాజ తదితరులు వార్డు సచివాలయానికి చేరుకుని గొడవకు దిగారు. తమకు తెలియకుండా నామినేషన్‌ ఎలా విత్‌ డ్రా చేస్తారంటూ ప్రశ్నించారు.దీంతో అక్కడే ఉన్న అధికారపార్టీ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు.ఇరువర్గాలూ తోపులాడుకోవడంతో వారిని వారించబోయే ప్రయత్నంలో సీఐ జయరామయ్య వెనక్కుతూలి ఎలాగో పడకుండా నిలదొక్కుకొన్నప్పటికీ,ఎస్‌ఐ ప్రియాంక మాత్రం కిందపడిపోయారు.  

 పుంగనూరులో అన్ని స్థానాలూ వైసీపీకి ఏకగ్రీవం


పుంగనూరు మున్సిపాలిటీలో బుధవారం 20 నామినేషన్లు ఉపసంహరణకు గురయ్యాయి. దీంతో తొలుత సింగిల్‌ నామినేషన్లు, తర్వాత మంగళ, బుధవారాల్లో జరిగిన ఉపసంహరణల ఫలితంగా మొత్తం 31 స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. అవన్నీ వైసీపీ దక్కించుకుంది. దీంతో ఇక్కడ 10వ తేదీన పోలింగ్‌ జరిగే అవసరం లేకుండా పోయింది. 

నగరి, పుత్తూరుల్లో 192 నామినేషన్ల ఉపసంహరణ

నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన బుధవారం నగరి మున్సిపాలిటీలో  58, పుత్తూరు మున్సిపాలిటీలో 134 చొప్పున మొత్తం 192 నామినేషన్లు విత్‌ డ్రా అయ్యాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే ఒత్తిళ్ళు, వేధింపులు, బెదిరింపులు ఎదుర్కోలేదని సమాచారం.  

Updated Date - 2021-03-04T06:33:16+05:30 IST