అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల చోరీ ముఠా గుట్టురట్టు
ABN , First Publish Date - 2021-10-28T05:33:44+05:30 IST
అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల చోరీ ముఠా గుట్టును మదనపల్లె తాలూకా పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారినుంచి రూ.3.40 లక్షల విలువైన 34 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు చెప్పారు.

ఇద్దరు నిందితుల అరెస్టు
34 సెల్‌ఫోన్ల స్వాధీనం
ఒకరిపై వరంగల్‌లో ఏడు కేసులు నమోదు
మదనపల్లె క్రైం, అక్టోబరు 27: అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల చోరీ ముఠా గుట్టును మదనపల్లె తాలూకా పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారినుంచి రూ.3.40 లక్షల విలువైన 34 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు చెప్పారు. బుధవారం తాలూకా పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం నల్లకుంటవీధికి చెందిన ఆకుల వడివేలు(48), ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా షాపూర్‌కు చెందిన ఆవుల దండ(31), మరికొందరు కలసి ముఠాగా ఏర్పడి సెల్‌ఫోన్ల చోరీని వృత్తిగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం చింతామణి, కోలార్, బెంగళూరు, చిత్తూరు జిల్లాలోని రామసముద్రం, పుంగనూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 34 సెల్‌ఫోన్లు చోరీ చేశారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వారపుసంత, రద్దీ ఉన్న ప్రాంతాల్లో చోరీలు చేసేవారు. ఇదిలావుండగా మంగళవారం తాలూకా పోలీసులు ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతం చీకిలబైలు చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఇద్దరు నిందితులు కర్ణాటక బస్సు దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. బస్సులోని బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను స్టేషన్‌కు తరలించారు. తమదైనశైలిలో విచారించగా వారి గుట్టు రట్టయింది. కాగా నిందితులు చోరీ చేసిన సెల్‌ఫోన్లను విక్రయించేందుకు హైదరాబాద్‌కు వెళుతున్నట్టు తేలంది. ఈ కేసులో బుధవారం నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ చెప్పారు. వడివేలుపై వరంగల్ జిల్లా హన్మకొండలో ఏడు సెల్‌ఫోన్ల చోరీ కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులు విలాసాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడి సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.