వేదాల్లో అనంతమైన శాస్త్ర విజ్ఞానం

ABN , First Publish Date - 2021-10-29T07:01:51+05:30 IST

‘వేదాల్లో అనంతమైన శాస్త్రవిజ్ఞానం నిక్షిప్తమై ఉంది. వీటిని పరిరక్షించి వ్యాప్తి చేయాలి’ అని రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు.

వేదాల్లో అనంతమైన శాస్త్ర విజ్ఞానం
గణేశన్‌ శ్రౌతికి మహామహోపాధ్యాయ పురస్కారం బహూకరణ - వేదికపై వేద వర్సిటీ వీసీ సుదర్శనశర్మ, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తదితరులు

పరిరక్షించి.. వ్యాప్తి చేయాలంటూ గవర్నరు హరిచందన్‌ సూచన 

గణేశన్‌శ్రౌతికి మహామహోపాధ్యాయ పురస్కారం 

ఘనంగా వేదవర్సిటీ 6వ స్నాతకోత్సవం


తిరుపతి(విద్య), అక్టోబరు 28: ‘వేదాల్లో అనంతమైన శాస్త్రవిజ్ఞానం నిక్షిప్తమై ఉంది. వీటిని పరిరక్షించి వ్యాప్తి చేయాలి’ అని రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం గురువారం ఆ వర్సిటీలోని యాగశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది. విశ్రాంత సామవేద పండితుడు బ్రహ్మశ్రీ గణేశన్‌శ్రౌతిని మహామహోపాధ్యాయ పురస్కారంతో సన్మానించారు. చాన్సలర్‌ హోదాలో గవర్నరు హరిచందన్‌ ఈ స్నాతకోత్సవానికి రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌లో అధ్యక్షత వహించి మాట్లాడారు. వేల సంవత్సరాల కిందటే గణిత, జ్యోతిష్య, వాణిజ్య, ఆర్థిక, విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలను మనపూర్వీకులు వేదాల్లోని వైదిక అంశాలను మేళవించి ప్రపంచానికి అందించారని గుర్తు చేశారు. భాస్కరుడి గణితశాస్త్రం, ధన్వంతరి వైద్యశాస్త్రం, విరాటసంహిత, భరద్వాజ విమానశాస్త్రం, కౌటిల్యుడి అర్ధశాస్త్రాలు వీటికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. వేద వర్సిటీలో నేటివైజ్ఞానిక అంశాలతో వేదగణితం, భారతీయ సంస్కృతి, సంస్కృత పాఠాలు జోడించి ఆన్‌లైన్‌ కోర్సులుగా ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మనపూర్వీకుల నుంచి వారసత్వంగా అందిన వేదాలను మరింతగా వ్యాప్తి చేయాలని వేద విద్యార్థులకు సూచించారు. భావితరాలకు వేదవిద్యను అందించేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మానవులను ఉన్నత మార్గంలో నడిపించడానికి వేద విజ్ఞానం తోడ్పడుతుందని మహామహోపాధ్యాయ పురస్కార గ్రహీత గణేశన్‌శ్రౌతి పేర్కొన్నారు. వేదం నిర్ణయించిన మార్గంలో ప్రతిమనిషి నడవాలని ఆకాంక్షిస్తూ.. రాబోవు తరాలకు ఈ వేదవిజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయలను అందించాల్సిన బాధ్యత వేదవిద్యార్థులపై ఉందన్నారు. వేదాల్లో ఆధ్యాత్మికజ్ఞానంతోపాటు సాంకేతికవిజ్ఞానం దాగుందని వివరించారు. వేదవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ సన్నిధానం సుదర్శనశర్మ తెలిపారు. వేదాలకు ప్రాచుర్యం కల్పించేందుకు పుస్తకాలు ముద్రిస్తున్నామని, రాతప్రతులను పరిష్కరిస్తున్నామని, వేదాలు, ఉపనిషత్తులను రికార్డింగ్‌ చేస్తున్నామని వివరించారు. వేదవిద్యవ్యాప్తికి చేస్తున్న కృషిని, వర్సిటీ సాధించిన ప్రగతిని వివరించారు. 


229 మందికి పట్టాలు 

ఈ స్నాతకోత్సవంలో 2019-20లో యూజీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు చదివిన 229మందికి పట్టాలు అందజేశారు. వీరిలో యూజీలో 122 మంది, పీజీలో 46, ఎంఫిల్‌లో ఇద్దరు, పీహెచ్‌డీలో 11, డిప్లొమా, సర్టిఫికెట్‌ విభాగంలో 48 మంది చొప్పున 229 మందికి పట్టాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, వేద వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.తారకరామకుమార్‌శర్మ, ఈసీ సభ్యుడు ప్రొఫెసర్‌ రామ్‌లాల్‌, డీన్లు ప్రొఫెసర్‌ గోలి సుబ్రహ్మణ్యశర్మ, ప్రొఫెసర్‌ శ్రీనివాసాచార్యులు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ రామకృష్ణాంజనేయులు, కోఆర్డినేటర్‌ ఉమే్‌షభట్‌, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.    

Updated Date - 2021-10-29T07:01:51+05:30 IST