రేషన్ వాహన డ్రైవర్లకు గౌరవ వేతనం పెంచండి
ABN , First Publish Date - 2021-02-06T06:45:57+05:30 IST
తమకు గౌరవ వేతనం పెంచాలని ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం నియమించిన వాహనదారులు డిమాండ్ చేశారు.

చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 5: తమకు గౌరవ వేతనం పెంచాలని ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం నియమించిన వాహనదారులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో రేషన్ డీలర్ల సంఘ నేతలు, రేషన్ వాహనదారులతో సమావేశాన్ని నిర్వహించారు. వాహనదారులు మాట్లాడుతూ పేరుకే రూ.16వేలు గౌరవ వేతనం, దానిలో హమాలీలకు రూ.3వేలు, డీజిల్‌కు రూ. 3వేలు, వాహన ఈఎంఐకి రూ.3వేలు పోతే మిగిలిన 7వేలతో కుటుంబాన్ని ఎలా పోషించేందని ప్రశ్నించారు. హమాలీలకు మూడువేలిస్తామంటే ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వమే హమాలీలను ఏర్పాటు చేసి తమ వాహనాలకు కేటాయించాలని జేసీని కోరారు. జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ తమకు ఎంఎల్ పాయింట్లలో వందశాతం ఖచ్చిత కాటా వేసి సరుకులను ఇవ్వాలని, రేషన్ కార్డుల మ్యాపింగ్‌లో జరిగిన తప్పొప్పులను సరిదిద్దాలని కోరారు. జేసీ మాట్లాడుతూ వాహనదారులకు డీలర్ల వద్ద ఉన్న హమాలీలు సహకరించాలని కోరారు. హమాలీలకు ఇచ్చే మూడువేలు పైకం ఏ మాత్రం సరిపోదని, దీన్ని మరింత పెంచాలని ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. వీఆర్వోలు, వలంటీర్లతో ఈ-పాస్ సాంకేతిక పరిజ్ఞానం గురించి రెండు నెలల పాటు తర్ఫీదు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో డీఎస్వో శివరామప్రసాద్, సివిల్‌సఫ్లయ్ డీఎం మోహన్‌బాబు, రాష్ట్ర డీలర్ల సంఘం కార్యదర్శి జ్యోతీశ్వర్‌రెడ్డి, జిల్లా నేతలు జయరామనాయుడు, కాజూరు రవి, పాల్గొన్నారు.
రాజీనామా బాటలో మొబైల్ వాహన డ్రైవర్లు
ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం నియమించిన మొబైల్ వాహనదారులు రాజీనామా బాట పట్టారు. చిత్తూరు నగర పరిధిలో 25 మొబైల్ వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే హమాలీలను ఏర్పాటు చేయక పోవడంతో డ్రైవర్లు సహాయ నిరాకరణ చేపట్టారు. వీరిలో ఇద్దరు డ్రైవర్లు శుక్రవారం రాత్రి రాజీనామా చేసి ఆ పత్రాలను తహసీల్దార్‌కు అందజేశారు. మరి కొందరు శని, ఆదివారాల్లో రాజీనామా చేయ నున్నట్లు తెలిసింది.