తిరుమల తరహాలో కాణిపాకంలో ఉదయాస్తమాన సేవకు శ్రీకారం

ABN , First Publish Date - 2021-12-31T05:38:25+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవకు శ్రీకారం చుడుతున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, చైర్మన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.

తిరుమల తరహాలో   కాణిపాకంలో ఉదయాస్తమాన సేవకు శ్రీకారం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, చైర్మన్‌ మోహన్‌రెడ్డి

ప్రాణదాన ట్రస్టు ఏర్పాటు

భక్తులకు ప్రత్యేక క్యూ కాంప్లెక్సు నిర్మాణం 

బోర్డు సమావేశంలో తీర్మానం


ఐరాల(కాణిపాకం), డిసెంబరు 30: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవకు శ్రీకారం చుడుతున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, చైర్మన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆలయ సమావేశ మందిరంలో వారి ఆఽధ్వర్యంలో బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో 19 అంశాలపై తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. ఉదయాస్తమాన సేవలో పాల్గొనదలచిన వారు ఆరుగురితో కూడిన కుటుంబ సభ్యులు లక్ష రూపాయలను చెల్లించవలసి ఉంటుందని చెప్పారు. డబ్బు కట్టిన భక్తులు ఏడాదిలో ఒక రోజు ఈ సేవలో పాల్గొనవచ్చన్నారు. అలాగే ప్రాణదాన ట్రస్టును ఏర్పాటు చేయడానికి దేవదాయ శాఖను అనుమతి కోరనున్నట్లు చెప్పారు. ఈ ట్రస్టు ద్వారా కాణిపాకంలో ప్రత్యేకమైన వసతులతో ఆస్పత్రిని నిర్మించి భక్తులకు, స్థానికులకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.  కాణిపాక క్షేత్రంలో కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి అనుమతులు తీసుకోనున్నట్లు చెప్పారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు నిర్మించనున్నట్లు వివరించారు. పార్కు ఏర్పాటు, భక్తులకు బస సౌకర్యార్థం వినాయక సదన్‌పై మరో వంద గదులను నిర్మించడానికి బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై దేవదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి  అనుమతులు రాగానే పనులను ప్రారంభిస్తామని వారు తెలిపారు.  కార్యక్రమంలో ఈవో వెంకటేశు, బోర్డు సభ్యులు గోవర్ధన్‌, గోపి, నరసింహులుశెట్టి, కొండయ్య, సుశీల, స్రతిమ, రామసుబ్బమ్మ, కాంతమ్మ, ఎక్స్‌అఫిషియో మెంబర్‌ సోమశేఖర్‌గురుకుల్‌, ఈఈ వెంకటనారాయణ, ఏసీ కస్తూరి, ఏఈవోలు వివ్యాసాగర్‌రెడ్డి, చిట్టెమ్మ, సుధారాణి, చంద్రశేఖర్‌, ఎస్వీ.కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:38:25+05:30 IST