ఎలా ఉండాలి?

ABN , First Publish Date - 2021-11-02T07:19:51+05:30 IST

చిన్నపాటి వానొస్తే చాలు.. తిరుపతి నడిబొడ్డున.. లీలామహల్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న మధురానగర్‌ మురికికూపంలా మారుతుంది.

ఎలా ఉండాలి?

చిన్నపాటి వానకే మురికి కూపంలా మధురానగర్‌


తిరుపతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): చిన్నపాటి వానొస్తే చాలు.. తిరుపతి నడిబొడ్డున.. లీలామహల్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న మధురానగర్‌ మురికికూపంలా మారుతుంది. కాలువల్లోని మురుగునీరు పొంగి.. వర్షపు నీటితో కలిసి రోడ్డుపై మోకాల్లోతు చేరుతుంది. గ్రౌండ్‌ ఫ్లోర్లలోని ఇళ్లల్లోకి ఈ నీళ్లు రావడంతో నివాసితులు అవస్థలు పడుతున్నారు. రెండు మూడు గంటల తర్వాత నీళ్లు పోయినా.. దుర్గంధంతో నిండిపోయిన ఇంటిని, వస్తువులను శుభ్రం చేసుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఇలా.. నెల రోజులుగా తరచూ పడిన వర్షంతో అల్లాడిపోతున్నారు. సోమవారమూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఇంతటి తీవ్రతకు కారణం.. కార్పొరేషన్‌ యంత్రాంగం ప్రణాళికలేని విధానమే. మధురానగర్‌తో పాటు దీనికి ఎగువన ఉన్న సుందరయ్యనగర్‌, యశోదగనర్‌, సప్తగిరి నగర్‌లో మురుగునీటి కాలువల ఆధునికీకరణ పనులకు టెండర్లు పిలిచారు. మధురానగర్‌కు ఎగువ ప్రాంతాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు కాలువ పనులు మొదలుపెట్టారు. మధురానగర్‌కి సంబంధించి పనులు మొదలుపెట్టలేదు. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా ఎగువనున్న ప్రాంతాలనుంచి వచ్చే వర్షపునీరు దిగువన ఉన్న మధురానగర్‌లోకి నిమిషాల్లో చేరిపోతోంది. సాధారణంగా మురుగునీటి కాలువల నిర్మాణాలు మొదలుపెట్టేటప్పుడు, అందులోనూ వర్షాకాలంలో దిగువ ప్రాంతాలను తొలుత ఎంచుకోవాలని ఇంజనీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిని గమనించిన స్థానికలు కార్పొరేషన్‌ అధికారులపై ఒత్తిడి తేవడంతో ఇక్కడా పనులు మొదలయ్యాయి. నీళ్లు నిలిచేచోటే పనులు మొదలు పెట్టడం వల్ల వర్షంవస్తే ఎక్కువ నీరు చేరిపోతోందని స్థానికులు అంటున్నారు. కాగా, సోమవారంనాటి వర్షంతో తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ స్తంభించి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జడివానతో ఆరుబయట దుకాణాలను మూసివేయాల్సి వచ్చింది. గరుడవారధి పిల్లర్ల నిర్మాణంతో ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండు ప్రాంగణంలో తూములు పూడిపోవడంతో ఆవరణంతా వర్షపునీటితో తటాకాన్ని తలపిస్తోంది. 

Updated Date - 2021-11-02T07:19:51+05:30 IST