కర్ణాటకలో కుండపోత

ABN , First Publish Date - 2021-10-14T05:53:47+05:30 IST

చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి.

కర్ణాటకలో కుండపోత
ఉధృతంగా ప్రవహిస్తున్న పాపాఘ్ని నది

చిత్తూరు జిల్లా సరిహద్దులో తెగిన చెరువులు, కుంటలు


పీటీఎం, బి.కొత్తకోటల్లో నిండుతున్న పెద్ద చెరువులు


 పెద్దతిప్పసముద్రం/ బి.కొత్తకోట, అక్టోబరు 13: చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. పాపాఘ్ని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా పడమట ఉన్న ఈ రెండు మండలాలు కర్ణాటకతో కొంత మిళితమై ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో కొన్ని చెరువులు, కుంటలు కూడా అక్కడి వర్షంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ క్రమంలో మూడురోజులుగా సరిహద్దులో కుండపోత వర్షం కురుస్తుండడంతో అక్కడి చెరువులు, కుంటలు మొరవపోయి బి.కొత్తకోట, పీటీఎం మండలాలకు పొటెత్తాయి. దీంతో కర్ణాటకలో మొదలయ్యే పాపాఘ్ని నది  పదేళ్ల తర్వాత ఉధృతంగా ప్రవహిస్తోంది.జిల్లాలోనే పెద్ద చెరువులుగా పేరొందిన పెద్దతిప్పసముద్రం తిప్పరాయసముద్రం (పీటీఎం పెద్ద చెరువు), కందుకూరు వ్యాసరాయ సముద్రం(కందుకూరు చెరువు), రంగసముద్రం రంగరాయ చెరువు జలకళ సంతరించుకున్నాయి.కర్ణాటకలో నంది హిల్స్‌ వద్ద ప్రారంభమయ్యే పాపాఘ్ని... పీటీఎం మండలంలో కేవలం మూడుకిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని అగ్రహారం చెరువు, కొర్లపత్తి చెరువుతోపాటు కుంటలు తెగిపోవడంతో పాపాఘ్నికి ఒక్కసారిగా వరద మొదలైంది. బుధవారం ఉదయం సుమారు 6 గంటల నుంచి కందుకూరు చెరువునకు నీరు చేరుతుండడంతో సాయంత్రానికి 75శాతం నిండిపోయింది. అలాగే పీటీఎం పెద్ద చెరువు కూడా సగానికి పైగా నిండింది. ఇక రంగసముద్రం చెరువుకు కూడా పాతికభాగం నీరు చేరింది. 500 అడుగులు వెడల్పు గల పాపాఘ్ని నది 30 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో టి.సదుం సమీపంలోని సంగమేశ్వరస్వామి ఆలయంలోకి వరదనీరు చేరింది. అలాగే రామాపురం నుంచి చెండ్రాయునిపల్లె వెళ్లే బ్రిడ్జి, టి.సదుం సమీపంలోని జమ్ముగానిపల్లె బ్రిడ్జి వరద ధాటికి కొట్టుకుపోయాయి. మరోవైపు నది వెంబడి రైతులు పంటపొలాలకు ఏర్పాటు చేసుకున్న చేతిబోర్లు, విద్యుత్తు మోటర్లు, పైపులు కొట్టుకుపోయాయి. పుష్కరకాలంలో మండలంలోని మూడు పెద్దచెరువులకు ఈ స్థాయిలో నీరు చేరలేదని రైతులు చెబుతున్నారు. ఈక్రమంలో వరద ఉధృతిని చూడడానికి స్థానికులు పాపాఘ్ని నదికి క్యూ కడుతున్నారు.బి.కొత్తకోట మండలంలో బీరంగి పెద్దచెరువు, కురప్పల్లె సమీపంలోని నాగల్‌ చెరువు, కంబాళ్లపల్లె చెరువులు నిండి మొరవ పోతున్నాయి. బీరంగి పెద్దచెరువు మొరవ పోతుండడంతో శంకరాపురం రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బీరంగి కట్టుకాలువ, బి.కొత్తకోట ఏరు, బీరంగి వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.కర్ణాటక సరిహద్దులో ప్రారంభమయ్యే వీటినుంచి  బి.కొత్తకోట, పీటీఎం మండలాలలోని చెరువులకు, కుంటలకు నీరు చేరుతోంది.  


వి.కోటలో నిండిన చెరువులు 


వి.కోట, అక్టోబరు 13: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వి.కోట మండల పరిధిలోని చెరువులన్నీ నిండి మొరవ పారుతున్నాయి.మంగళవారం రాత్రి కురిసిన వానకు చిన్నాగనపల్లెలో ఓ ఇల్లు పూర్తిగా కూలి తల్లీకుమారులు తీవ్రంగా గాయపడ్డారు. బేతమంగళం చెరువు మొరవ పారడంతో పాలారు నది నీటితో కళకళలాడుతోంది.  





Updated Date - 2021-10-14T05:53:47+05:30 IST