తిరుపతిలో కుండపోత వర్షం

ABN , First Publish Date - 2021-09-29T06:39:38+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం మంగళవారం తిరుపతిని తాకింది. పగలంతా ఎండతీవ్రత కొనసాగినా సాయంత్రానికి ఆకాశం మేఘావృతమైంది.

తిరుపతిలో కుండపోత  వర్షం
వెస్ట్‌ చర్చి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద వర్షపునీటి ప్రవాహం-ద్విచక్ర వాహనదారు అవస్థలు

తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం మంగళవారం తిరుపతిని తాకింది. పగలంతా ఎండతీవ్రత కొనసాగినా సాయంత్రానికి ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం విడతలు విడతలుగా కురిసింది.సాయంత్రం బయటకు వచ్చిన జనాన్ని ముద్దముద్ద చేసింది. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి.పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలబడడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. అభివృద్ధి పనుల్లో భాగంగా తిరుమల బైపా్‌సరోడ్డులో కాలువలు అక్కడక్కడా స్తంభించాయి. దీంతో జోరుగా ప్రవహించిన వర్షపునీరు రోడ్లపై పొంగిపొర్లి వరదను తలపించింది.లీలామహల్‌ జంక్షన్‌, వెస్ట్‌ చర్చి ప్రాంతాల్లో వర్షపునీరు వాగులా తయారవడంతో ద్విచక్రవాహనదారులు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ సెంట్రల్‌ బస్టేషన్‌ ఆవరణంలో నీరు నిలిచిపోవడంతో చెరువును తలపించింది.ప్రయాణికుల రాకపోకలకు ఆటంకంగా మారింది.మరోవైపు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది.శ్రీకాళహస్తి, సదుం ప్రాంతాల్లోనూ మంచి వర్షం పడింది.



Updated Date - 2021-09-29T06:39:38+05:30 IST