కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-24T06:34:39+05:30 IST

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం
తన ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి

తిరుపతి(పద్మావతినగర్‌), మే 23: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు. ఆ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఆదివారం జిల్లాలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు. విపక్ష కార్యకర్తలను, నాయకులను అరెస్ట్‌ చేయడంలో ఉన్న శ్రద్ద కరోనాను అరికట్టడంలో ప్రభుత్వానికి లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో తన ఇంటి వద్ద ఆయన పలువురు నాయకులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఫీజులను నిర్దేశించినా.. వాటిని ఉల్లఘించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదంటూ ప్రశ్నించారు. తూతూ మంత్రంగా విజిలెన్స్‌ దాడులు నిర్వహించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. గతేడాది కొవిడ్‌ మొదటి దశలో ఎదురైన తీవ్ర పరిణామాలను చూసికూడా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ఏమాత్రం పాటుపడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-24T06:34:39+05:30 IST