లైంగిక వేధింపుల కేసులో డాక్టర్‌ రమేష్‌బాబుపై అభియోగాలు

ABN , First Publish Date - 2021-02-05T07:36:28+05:30 IST

వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై క్షయ వ్యాధి నియంత్రణ అధికారి(డీటీబీసీవో) డాక్టర్‌ బి.రమేష్‌ బాబుపై అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

లైంగిక వేధింపుల కేసులో  డాక్టర్‌ రమేష్‌బాబుపై అభియోగాలు

డాక్టర్‌ పుష్పలత ఫిర్యాదుపై ప్రభుత్వ ఆదేశాలు


కలికిరి, ఫిబ్రవరి 4:  వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై క్షయ వ్యాధి నియంత్రణ అధికారి(డీటీబీసీవో) డాక్టర్‌ బి.రమేష్‌ బాబుపై అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రమేష్‌బాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడని చిత్తూరు క్షయ వ్యాధి నిరోధక ఔషధ(డీఆర్‌టీబీ) కేంద్రంలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసరుగా పనిచేస్తున్న  వై.పుష్పలత చేసిన ఫిర్యాదుపై జిల్లాస్థాయిలో జరిగిన విచారణ అనంతరం ప్రభుత్వానికి చేరిన నివేదిక మేరకు ఆయనపై అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వం సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. ఏడాది క్రితం జిల్లాలో ఈ వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. తనపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి  పుష్పలత చేసిన ఫిర్యాదుపై కలెక్టరు నలుగురు జిల్లాస్థాయి మహిళా అధికారులతో అప్పట్లో విచారణకు ఆదేశించారు. అప్పటి జాయింట్‌ కలెక్టర్‌-2 కె.ఎం. కమలకుమారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి జి.ఉషా ఫణికర్‌, సెట్విన్‌ సీఈవో ఎస్‌.లక్ష్మి, ప్రస్తుత డీసీహెచ్‌ఎస్‌  సరళమ్మలతో కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీ నిగ్గు తేల్చిన అంశాలు స్థూలంగా ఇలా వున్నాయి. కార్యాలయ సిబ్బంది అభిప్రాయాల ప్రకారం రమేష్‌ బాబు విధి నిర్వహణలో శ్రద్ధతో వుంటాడు. సిబ్బంది చేత పనిచేయించడంలో ఖచ్చితత్వాన్ని పాటిస్తాడు.అయితే విచారణ సందర్భంగా  పుష్పలత అందజేసిన ఫోన్‌ కాల్‌ రికార్డులు మరో విధంగా వున్నాయి. రమేష్‌ బాబు ఆమెను ఫోన్‌లో వాకబు చేస్తూ బయట వినబడుతున్న పుకార్ల గురించి తెలుసా అని ప్రశ్నించారు. అలాంటివేవీ తనకు తెలియదని...ఆ వదంతులేమిటో చెప్పాలని పుష్పలత అడగ్గా దానికి ‘నీకూ నాకూ లింకు వుందని’ రమేష్‌ బాబు సమాధానమిచ్చారు. రమేష్‌ బాబు నేరపూరితమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లేనని కాల్‌ రికార్డింగ్‌లు రుజువు చేస్తున్నట్లు కమిటీ అభిప్రాయపడింది. క్రమ శిక్షణా చర్యలకు ఆయన బాధ్యుడేనని కమిటీ చివరికి తేల్చి చెప్పింది. తగు చర్యల కోసం నివేదిక ప్రభుత్వానికి చేరడంతో ప్రాథమికంగా ఆయన వివరణ కోసం సంజాయిషీ నోటీసులు జారీ చేసింది.ఆయన ఇచ్చే వివరణ అనంతరం ప్రభుత్వం విచారణకు ఆదేశించి తదుపరి చర్యలకు ఉపక్రమించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-02-05T07:36:28+05:30 IST