కుప్పం టౌన్‌బ్యాంకులో బంగారు మాయ..!

ABN , First Publish Date - 2021-11-02T06:53:23+05:30 IST

కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లో జరిగిన భారీ అక్రమాలు మరువకముందే, కుప్పం కోఆపరేటివ్‌ టౌన్‌బ్యాంకులో మరో మోసం వెలుగులోకి వచ్చింది. అక్కడంతా డబ్బులు స్వాహా చేస్తే, ఇక్కడ బంగారు మాయ సృష్టించారు. కంచే చేను మేసిన చందం గా బ్యాంకును అభివృద్ధిబాటలో నడిపించాల్సిన ఉద్యోగులే ఖజానాకు కన్నం వేశారు.

కుప్పం టౌన్‌బ్యాంకులో బంగారు మాయ..!

ఉద్యోగులు, సిబ్బంది చేతివాటంతో రూ.2కోట్ల  స్వాహా

 నలుగురు శాశ్వతంగా తొలగింపు.. ఇద్దరి సస్పెన్షన్‌

నిందితులపై క్రిమినల్‌ కేసులు.. కొనసాగుతున్న విచారణ

కమిటీ తొలగింపునకు రాజకీయ ఒత్తిళ్లు.. కొత్త కమిటీకి మంత్రి సిఫార్సు


 మదనపల్లె, నవంబరు 1: కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లో జరిగిన భారీ అక్రమాలు మరువకముందే, కుప్పం కోఆపరేటివ్‌ టౌన్‌బ్యాంకులో మరో మోసం వెలుగులోకి వచ్చింది. అక్కడంతా డబ్బులు స్వాహా చేస్తే, ఇక్కడ బంగారు మాయ సృష్టించారు. కంచే చేను మేసిన చందం గా బ్యాంకును అభివృద్ధిబాటలో నడిపించాల్సిన ఉద్యోగులే ఖజానాకు కన్నం వేశారు. కుప్పం కోఆపరేటివ్‌ టౌన్‌బ్యాంకులో 2019-20లో అక్రమాలు జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది.లేని బంగారాన్ని బినామీ పేర్లతో తాకట్టు పెట్టి కొంత, ఖాతా దారులు బ్యాంకుకు చెల్లించిన నగదు రూపంలో మరికొంత.. సుమారు రూ.2కోట్ల మేర స్వాహా చేసినట్లు గుర్తించారు.  2020 జనవరిలో కొలువుదీరిన నామినేటెడ్‌ కమిటీ ఫిర్యాదు మేరకు సహకారశాఖ అధికారులతోపాటు త్రీమెన్‌ కమిటీ వేర్వేరుగా చేపట్టిన విచారణలో అక్రమాలు జరిగినట్లు బ్యాంకు పాలకవర్గం నిర్ణయించింది.ఈ క్రమంలో బ్యాంకు నామినేటెడ్‌ కమిటీ ఐదు నెలల క్రితం అప్రైజర్‌ సహా నలుగురు ఉద్యోగులను శాశ్వతంగా తొలగించగా, మరో ఇద్దరిని సస్పెండ్‌ చేసింది. వీరిలో నలుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదు కావడం చర్చనీ యాంశంగా మారింది. ఈ క్రమంలో తాత్కాలిక ఉద్యోగుల తో బ్యాంకు రోజువారీ కార్యకలాపాలు నడుస్తున్నాయి. అప్పటి బ్యాంకు సీఈవో నవీన్‌కుమార్‌, అప్రైజర్‌ సుబ్రహ్మణ్యం, బిల్‌కలెక్టర్లు కిరణ్‌కుమార్‌, కమల్‌కుమార్‌ల ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించగా, అసిస్టెంట్‌ మేనేజర్‌ వేదవతి, క్యాషియర్‌ దీపలను సస్పెండ్‌ చేశారు. ఇందులో బంగారంతో సహా నగదు సుమారు రూ.2కోట్లు మేర స్వాహా అయినట్లు గుర్తించారు. ఇందులో అప్రైజర్‌ సుబ్రమణ్యం,క్యాషియర్‌ దీప నుంచి రూ.90 లక్షలు రికవరీ చేయగా, 2017-18లో నగదు లావాదేవీలలో రూ.35లక్షలు మేర గోల్‌మాల్‌ జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. మిగిలిన రూ.70లక్షలను నిందితుల నుంచి రికవరీ చేసేం దుకు అఽటు అధికారులు, ఇటు పాలకవర్గం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను, ఇద్దరు ఉద్యోగుల ఆస్తులు జప్తు చేయడానికి ఆ శాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్‌ పిటీషన్‌ (ఈపీ) దాఖలు చేశారు. ఈ విష యాన్ని ముందుగానే పసిగట్టిన నిం దితులు ఆస్తులను ఇతరుల పేరున బదలాయించినట్లు సమాచారం.

అక్రమాలు ఇలా..! : బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి కస్టమర్లు రుణం తీసుకున్నట్లు ఉద్యోగులు, సిబ్బంది రికార్డులు సృష్టించారు. ఇలా తాకట్టు పెట్టని బంగారానికి, లేని వ్యక్తులను చూపించి మాయ చేశారు.ఇందులో బ్యాంకు అప్రైజర్‌ సహా ఉద్యోగులు, సిబ్బంది తమకు కావల్సిన పేర్లతో రుణాలు తీసుకున్నారు. కొందరి పేర్లతో లాకర్‌లో బంగారంతో కూడిన బ్యాగు పెట్టినా..వాటికి నంబర్లు వేసి, లెగ్జర్‌లో నమోదు చేసినా, ఖాళీవనే విచారణలో గుర్తించారు. మరోవైపు ఈ బంగారు మాయ వ్యవహారం బయట పడకుండా ఏటా ఆడిట్‌ జరిగే మార్చి 31వతేదీ నాటికి.. రుణగ్రస్తులు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకుని వెళ్లారని మరికొన్ని రికార్డులు సృష్టించడం విచారణ అధికారులను నివ్వెరపాటుకు గురిచేసింది. అలాగే నిజంగా బంగారు తాకట్టు పెట్టిన బంగారాన్ని గడువు మీరిపోవడంతో వారికి తెలియకుండానే, వేలం వేసినట్లు, అది తక్కువ ధరకు పోయినట్లు, మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని రికార్డులో నమోదు చేసినట్లు తెలిసింది. ఇలా అవకాశం ఉన్న అన్ని మార్గాల్లోనూ అక్రమాలకు పాల్పడినట్లు సహాకారశాఖ ఎంక్వయిరీ: 51, 52తోపాటు నామినేటెడ్‌ పాలకవర్గం ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ గుర్తించినట్లు చెబుతున్నారు. మరోవైపు నగదును బ్యాంకుకు చూపించడంలోనూ వీరు చేతివాటం ప్రదర్శించారన్నది అభియోగం. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నిందితుల్లో ఒకరిపై మరొకరు నెపం వేసుకుంటుండగా, 2017-18లో తేడా వచ్చిన లెక్కల్లో అక్రమాలే జరగలేదని సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో భాగంగా వారు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. టౌన్‌బ్యాంకులో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అక్రమాలపై కుప్పం పోలీసులు నలుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. దీనికి కొనసాగింపుగా జరుగుతున్న విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. గత ఏడాది జనవరిలో కొలువుదీరిన నామినేటెడ్‌ పాలకవర్గం బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలపై విచారణకు ఆదేశించడంతో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవడంతో వారిస్థానంలో అయిదు నెలలుగా తాత్కాలిక ఉద్యోగులతో బ్యాంకు వ్యవహారాలు నడుస్తున్నాయి. మరోవైపు నామినేటెడ్‌ కమిటీలోని చైర్మన్‌, సీఈవోలు రిటైర్డ్‌బ్యాంకు ఉద్యోగులు కావడం ఇక్కడ పనిచేసినట్లు చెబుతున్నారు. వారు విధి నిర్వహణలో నిజాయితీగా, రాజకీయాలకు తావులేకుండా నిక్కచ్చిగా వ్యవహరించడం కూడా అక్రమాలు బయట పడడానికి కారణమని చెప్పవచ్చు.ఈ నేపథ్యంలో ఈ కమిటీని తొలగించి, కొత్త త్రీమెన్‌ కమిటీకి పేర్లను సూచిస్తూ, నియమించాలని కోరుతూ మంత్రి పెద్దిరెడ్డి సిఫార్సుతో కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జి భరత్‌  సహకారశాఖ మంత్రి కన్నబాబుకు, ఆ శాఖ కమిషనర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మున్ముందు విచారణ ఏ   మలుపు తీసుకోనుందో అనే విషయం ఆసక్తికరంగా మారింది.


Updated Date - 2021-11-02T06:53:23+05:30 IST