గుండోడి చెరువుకు గండి!

ABN , First Publish Date - 2021-10-28T05:56:24+05:30 IST

మట్టి తవ్వకాలకు అడ్డుగా వుందని ఏకంగా చెరువు తూముకే గండి కొట్టిన వైనమిది. దీంతో ముప్పావు వంతు నిండిన చెరువు నుంచీ నీరంతా వృధాగా వెళ్ళిపోయింది. చెరువు కింద ఆయకట్టు పొలాల్లోకి నీరు ప్రవహించడంతో పంటలు దెబ్బతిన్నాయి.

గుండోడి చెరువుకు గండి!
కట్ట తెగిపోవడంతో వుధ్రుతంగా ప్రవహిస్తున్న చెరువునీళ్లు - చెరువుకట్టకు మరమ్మతులు

మట్టి తవ్వకాల కోసం వైసీపీ నేతల నిర్వాకమంటూ టీడీపీ నేతల ఫిర్యాదు

కాదు ప్రమాదమంటున్న అధికారులు


తిరుపతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మట్టి తవ్వకాలకు అడ్డుగా వుందని ఏకంగా చెరువు తూముకే గండి కొట్టిన వైనమిది. దీంతో ముప్పావు వంతు నిండిన చెరువు నుంచీ నీరంతా వృధాగా వెళ్ళిపోయింది. చెరువు కింద ఆయకట్టు పొలాల్లోకి నీరు ప్రవహించడంతో పంటలు దెబ్బతిన్నాయి. కాగా అధికారులు దీన్ని ప్రమాదవశాత్తూ సంభవించిన ఘటనగా చెబుతుంటే గ్రామస్తులు, టీడీపీ నేతలు మాత్రం అధికార పార్టీ నేతల నిర్వాకమేనంటున్నారు. రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ కొత్తనెన్నూరు ఎస్టీ కాలనీ పక్కనే గుండోడి చెరువు 50 ఎకరాల విస్తీర్ణం కలిగివుంది. దీని కింద శాకమూరి కండ్రిగ, నెన్నూరు, నడవలూరు, కొత్తకండ్రిగ, గణే్‌షపురం తదితర గ్రామాలకు చెందిన 300 ఎకరాల ఆయకట్టు వుంది. చెరువు పక్కనే గుట్టలో గత నెలన్నరగా గ్రావెల్‌ తవ్వకాలు అక్రమంగా జరిగాయి. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా తవ్వకాలు ఆగాయి. అయితే కొందరు ప్రభుత్వ అనుమతి తీసుకుని మళ్ళీ తవ్వకాలు ప్రారంభించారు. ఆ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో తూము తెగిపోయిందంటూ గ్రామస్తుల నుంచీ అధికారులకు సమాచారమందింది. రెండు గంటల్లోపే తహసిల్దారు చిన్న వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ ఎర్రిస్వామి సిబ్బందితో వెళ్ళి పొక్లయినర్లతో మరమ్మతులు చేయించారు. రెండు మూడు గంటల వ్యవధిలోనే తూముకు పడిన గండిని పూడ్పించారు. అధికారులు అక్కడికి చేరుకునేటప్పటికే చెరువు నుంచీ చాలా నీరంతా పొలాలపైకి, పక్కనే వున్న ఎస్టీ కాలనీలోకి ప్రవేశించాయని స్థానికులు చెబుతున్నారు. తూము తెగిపోవడానికి కారణం ప్రమాదమేనని రెవిన్యూ అధికారులు చెప్పారు. చెరువు కట్ట బలహీనపడినందువల్లే ఇలా జరిగిందని భావిస్తున్నట్టు చెప్పారు.అయితే స్థానికులు, టీడీపీ నాయకుల కథనం భిన్నంగా వుంది. గ్రావెల్‌ తవ్వకాలు జరపాలంటే చెరువు దాటి వెళ్ళాల్సి వుందని, దానికి నీరు అడ్డుగా వున్నందున ఉద్దేశపూర్వకంగా తూము తెంచేశారని ఆరోపిస్తున్నారు. గ్రావెల్‌ తవ్వకాలు ఇటీవలి వరకూ అక్రమంగా జరిగాయని, ఒకవేళ కొత్తగా అనుమతి తెచ్చుకున్నా కూడా చెరువులు, కుంటలు, వాటి కట్టలు, తూములకు సమీపంలో తవ్వకాలు జరపడానికి నిబంధనలు అంగీకరించవని వారు స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానీ, అధికార ప్రతినిధి చిన్నబాబు, కోశాధికారి ఉమాపతినాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి, నాయకులు కోరా హరిప్రసాద్‌, ధనుంజయరెడ్డి, ఢిల్లీనాధరెడ్డి తదితరులు మాట్లాడుతూ అనుమతి ఇచ్చిన చోట గ్రావెల్‌ తవ్వకాలు జరపకుండా చెరువు సమీపంలో తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. దానికోసమే చెరువుకు గండి కొట్టారన్నారు. గ్రావెల్‌ తవ్వకాలపైన, చెరువు తూముకు గండి కొట్టిన ఘటనపైనా విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని జిల్లా  అధికారులకు ఫిర్యాదు కూడా చేయనున్నట్టు చెప్పారు.

Updated Date - 2021-10-28T05:56:24+05:30 IST