ప్రియురాలు దక్కదని.. గొంతు కోసి.. 19 సార్లు పొడిచి..

ABN , First Publish Date - 2021-01-20T06:10:14+05:30 IST

ఆరవ తరగతి నుంచి కలిసి మెలిసి తిరిగిన అమ్మాయిని..

ప్రియురాలు దక్కదని.. గొంతు కోసి.. 19 సార్లు పొడిచి..

ప్రేమోన్మాదం

దక్కదన్న అనుమానంతో పొడిచి చంపేశాడు

నిందితుడి ఇంటికి నిప్పంటించిన మృతురాలి బంధువులు

చింతమాకులపల్లె, తూర్పుపల్లెల్లో ఉద్రిక్త వాతావరణం


పెనుమూరు(చిత్తూరు):
 వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆపై పెద్దలకు తెలియకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దలు పోలీస్‌ స్టేషన్‌లో పంచాయితీ పెట్టారు. యువకుడికి పెళ్లి వయస్సు రాకపోవడంతో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి వారిళ్లకు పంపించేశారు.... ఇదంతా డిసెంబరు 13న జరిగిన సంఘటన.


తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తల్లిదండ్రుల మాటలు విని మనసు మార్చుకుందని భావించిన ఆ యువకుడు రగిలిపోయాడు. తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడు. సరిగ్గా 37 రోజుల తరువాత అంటే మంగళవారం అదును చూసి కత్తితో దాడి చేశాడు. ఏకంగా 19 సార్లు ఆ యువతిని కత్తితో పొడిచి చంపేశాడు. 


పెనుమూరు మండలం తూర్పుపల్లెకు చెందిన షణ్ముగరెడ్డి, రాజేశ్వరి దంపతుల  పెద్ద కుమార్తె గాయత్రి(20) సమీపంలో వున్న పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన సుబ్బయ్య కుమారుడు డిల్లీబాబు(20) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి గతేడాది డిసెంబరు 11న తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన షణ్ముగరెడ్డి తన కుమార్తెను డిల్లీబాబు కిడ్నాప్‌ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిల్లీబాబు మైనర్‌ అని తెలియడంతో పెళ్లి చెల్లదని భావించిన పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారివారి ఇళ్లకు పంపించేశారు. ఆరవ తరగతి నుంచి కలిసి మెలిసి తిరిగిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే... కులం వేరనే కారణంతో విడదీశారని డిల్లీబాబు రగిలిపోయాడు. మరోవైపు గాయత్రిని ఆమె తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తపడడంతో తనకు దూరమైపోతుందన్న అనుమానం డిల్లీబాబులో మొదలైంది. తనకు దక్కని గాయత్రి ఇంకెవరికీ దక్కకూడదని భావించాడు.


ఈ నేపథ్యంలో మంగళవారం గాయత్రి పక్కింటి అమ్మాయిలు రమ్య, లోహితలతో కలిసి స్కూటీలో పెనుమూరుకు వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో వస్తుండగా రాజాయిండ్లు సమీపంలో వాహనాన్ని డిల్లీబాబు ఆపాడు. గాయత్రిని రమ్మని పిలవగా ఆమె నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన డిల్లీబాబు విచక్షణ కోల్పోయాడు. తాను తెచ్చుకున్న చాకుతో గాయత్రి గొంతు కోయడంతో ఆమె కిందపడిపోయింది. దీంతో ఆమెతో వచ్చిన ఇద్దరు భయంతో గ్రామానికి పారిపోయారు. గాయత్రి శరీరంపై కత్తితో 19 చోట్ల కిరాతకంగా పొడిచిన డిల్లీబాబు ఆమె చనిపోయిందనుకుని పారిపోయాడు. ఈలోపు గాయత్రి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు రాజాఇండ్లు వద్దకు చేరుకుని గాయత్రిని పెనుమూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడినుంచి చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం గాయత్రి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు.  


నిందితుడి ఇంటిపై దాడి 

గాయత్రి చనిపోయిందని తెలిసి డిల్లీ బాబు ఇంటిపై తూర్పుపల్లెవాసులు దాడి చేశారు. పెట్రోల్‌ పోసి నిప్పంటించంతో పాటు డిల్లీబాబు తండ్రి సుబ్బయ్యను చితకబాదారు. అతడు వదిలి వెళ్లిపోయిన ద్విచక్రవాహనాన్ని కూడా కాల్చేశారు. ఈ సమాచారమందుకున్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ ఆశీర్వాదం, పెనుమూరు, పాకాల, కల్లూరు ఎస్‌ఐలు చింతమాకులపల్లెకు చేరుకుని గాయపడిన సుబ్బయ్యను కారులో స్టేషన్‌కు తీసుకువస్తుండగా గుర్తించిన తూర్పుపల్లెవాసులు మరోమారు దాడికి ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో రోప్‌పార్టీలను రప్పించిన పోలీసు అధికారులు అతికష్టంమీద సుబ్బయ్యను స్టేషన్‌కు తరలించారు.  చింతమాకులపల్లె, తూర్పుపల్లెల్లో పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేశారు.


Updated Date - 2021-01-20T06:10:14+05:30 IST