మదనపల్లె -తిరుపతి నాలుగు వరుసల రహదారికి నిధులు !
ABN , First Publish Date - 2021-07-28T04:30:44+05:30 IST
జిల్లాలో ప్రాధాన్యత కలిగిన మదనపల్లె -తిరుపతి రహదారికి మహర్దశ పడుతోంది.
ఎంపీ మిధున్‌రెడ్డి చొరవతో ప్రభుత్వంలో కదలిక
నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ
రెండు నెలల్లో పనులు ప్రారంభం
పీలేరు, జూలై 27: జిల్లాలో ప్రాధాన్యత కలిగిన మదనపల్లె -తిరుపతి రహదారికి మహర్దశ పడుతోంది. బళ్లారి- నాయుడుపేట జాతీయ రహదారి (ఎన్‌హెచ్-71)లో ఉన్న ఈ రోడ్డును నాలుగు వరుసల స్థాయికి అభివృద్ధి చేసేందుకు కేంద్ర రహదారులశాఖ నిధులు మంజూరు చేసింది. ఢిల్లీలో కేంద్ర రహదారులు, ఉపరితలశాఖామంత్రి నితిన్ గడ్కరీని సోమవారం ఎంపీ మిథున్‌రెడ్డి రాష్ట్ర ఎంపీల బృందంతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మదనపల్లె - తిరుపతి నాలుగు వరుసల నిర్మాణ పనులు భూసేకరణ ప్రక్రియ వరకే ఆగిపోయాయని, ఈ పనులను వేగవంతం చేసేందుకు ప్రథమ ప్రాధాన్యతతో నిధులు మంజూరు చేసి చర్యలు చేపట్టాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరి అప్పటికప్పుడే నిధులు మంజూరుకు ఆదేశాలు జారీచేయడంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఒక రోజు వ్యవధిలోనే టెండర్లు, పనుల ప్రారంభానికి సంబంధించిన ప్రక్రియలకు అధికార యంత్రాంగం కాలపరిమితులను ఖరారు చేసినట్లు తెలిసింది. నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించి రెండు నెలల్లో పనులను ప్రారంభిం చేలా చర్యలు చేపడుతున్నారు.
ఎట్టకేలకు మోక్షం
మూడేళ్లుగా నిధుల సమస్యతో స్తంభించిన మదనపల్లె -తిరుపతి నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలుగనుంది. ఈ మార్గంలోని శానిటోరియం, సీటీఎం, వాల్మీకిపురం, కలికిరి, పీలేరు తదితర ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. మదనపల్లె నుంచి తిరుపతి వరకు ప్రస్తుతం 120కి.మీలు ఉన్న ఈ రహదారి దూరం కూడా 100 కి.మీలే కానుంది. నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో ప్రస్తుతం ఉన్న డబుల్ రోడ్డులోని మలుపులు తొలగనుండడంతో దాదాపు 20కి.మీల దూరం తగ్గనుంది. దీంతో ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యం చేకూరుతుంది. అలాగే మదనపల్లె, పీలేరు, చంద్రగిరి, పుంగనూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలు అభివృద్ధికి దోహదపడనుంది.
ఎంపీ మిధున్‌రెడ్డి చొరవ ఆదర్శనీయం : చింతల
మదనపల్లె -తిరుపతి రహదారిని నాలుగు వరుసల స్థాయికి అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయించడంలో ఎంపీ మిథున్‌రెడ్డి చొరవ అభినందనీయమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.