తిరుపతిలో ఇద్దరు మహిళల బలవన్మరణం

ABN , First Publish Date - 2021-10-07T07:14:11+05:30 IST

తిరుపతిలో ఇద్దరు మహిళలు బలవన్మరణం పొందారు. భర్త వరకట్న వేధింపులు తాళలేక కుముద.. భర్త ప్రవర్తనతో విసిగి ఉషారాణి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

తిరుపతిలో ఇద్దరు మహిళల బలవన్మరణం
కుముద మృతదేహం

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 6: తిరుపతిలో ఇద్దరు మహిళలు బలవన్మరణం పొందారు. భర్త వరకట్న వేధింపులు తాళలేక కుముద.. భర్త ప్రవర్తనతో విసిగి ఉషారాణి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలిపిరి ఎస్‌ఐ ఇమ్రాన్‌బాషా తెలిపిన ప్రకారం.. పిచ్చాటూరు మండలం కీలపూడికి చెందిన కుముద (28)కు ఏర్పేడు మండలం పాపానాయుడుపేటకు చెందిన ఎన్‌.సుధాకర్‌తో పదేళ్లక్రితం వివాహమైంది. రూ.లక్ష నగదు, 15 సవర్ల బంగారు వరకట్నంగా ఇచ్చారు. వీరు కొద్ది సంవత్సరాలుగా తిరుపతి జీవకోనలోని పార్వతీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి గుణశ్రీ, అశ్విన్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. పనీపాటా లేని సుధాకర్‌ మద్యానికి బానిసయ్యాడు. పైగా భార్యను అనుమానించడంతో పాటు కట్నం కోసం భార్యను వేధించేవాడు. ఈ వేధింపులు తాళలేక ఆమె మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన కుటుంబసభ్యులు రుయాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించిన అలిపిరి పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అలాగే, నిత్యం తగాదాపడుతున్న భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఉషారాణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈస్ట్‌ ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపిన ప్రకారం.. జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఆనంద్‌, ఉషారాణి, ఇద్దరు పిల్లలతో కలిసి తిరుపతి యాదవకాలనీలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన ఆనంద్‌ నిత్యం గొడవపడేవాడు. ఇదేక్రమంలో బుధవారం ఉదయం కూడా గొడవపడటంతో మనస్తాపానికి గురైన ఉషారాణి.. తన చీరతో ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన భర్త, ఇరుగుపొరుగు వారితో కలిసి తలుపులు పగులగొట్టి ఆమెను కిందకు దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను పరీక్షించి.. అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఈస్ట్‌ ఎస్‌ఐ నాగేంద్రబాబు, సిబ్బంది అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-07T07:14:11+05:30 IST