వైఫల్యం వల్లే వరద

ABN , First Publish Date - 2021-11-26T08:13:14+05:30 IST

తిరుమల కొండపై ఉన్న రిజర్వాయర్లు,దిగువన కళ్యాణి డ్యామ్‌ లో నీటి నిల్వల నిర్వహణలో జరిగిన వైఫల్యమే తిరుపతిలో భారీ నష్టానికి కారణమైందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.

వైఫల్యం వల్లే వరద
టీడీపీ నేతలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

తిరుపతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల కొండపై ఉన్న రిజర్వాయర్లు,దిగువన కళ్యాణి డ్యామ్‌ లో నీటి నిల్వల నిర్వహణలో జరిగిన వైఫల్యమే తిరుపతిలో భారీ నష్టానికి కారణమైందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.కడప, చిత్తూరు జిల్లాల్లోని వరద బాధిత ప్రాం తాల్లో పర్యటన ముగించుకుని నెల్లూరు జిల్లాకు బయల్దేరి వెళ్ళే ముందు గురువారం ఉదయం ఆయ న రేణిగుంటలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ఈనెల ఆరంభం నుంచే కురుస్తున్న వానలతో తిరుమల కొండపై ఉన్న రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.అయినా అప్రమత్తం కాలేదు.రిజర్వాయర్ల నుంచి నీటిని ముందస్తుగా విడుదల చేసివుంటే కపిలతీర్థం ద్వారా తిరుపతి నగరంలోకి వరద నీరు వచ్చి పడేది కాదు’’ అని వివరించారు. కళ్యాణి డ్యామ్‌ విషయంలోనూ ఇంతే నిర్లక్ష్యం చూపారని అన్నారు.‘‘శేషాచల కొండల నుంచీ వచ్చిన నీరంతా పెరుమాళ్ళపల్లి చెరువుపై పడడంతో అది  తెగిపోయింది. ఆ నీరంతా దిగువన వున్న పేరూరు చెరువుకు చేరడంతో అదీ తెగిపోయింది. నిజానికి ఆ నీరంతా కలసి తుమ్మలగుంట చెరువు చేరాలి. అక్కడి నుంచీ అదనపు నీరు స్వర్ణముఖి నదిలో కలవాలి. అయితే తుమ్మలగుంట చెరువును క్రికెట్‌ స్టేడియంగా మార్చేయడంతో, నీళ్ళు పోటెత్తి తిరుపతి మీద పడ్డాయి.పద్మావతీ మహిళా వర్శిటీ నుంచీ ముత్యాలరెడ్డిపల్లి, ఆటోనగర్‌ దాకా నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తేశాయి.’’ అని వరద కారణాలను విశ్లేషించి మీడియాకు వివరించారు. రాయలచెరువు భద్రతపై జనం భయభ్రాంతులయ్యారని, తాను కూడా టీవీలో చూసి ఆందోళనకు గురయ్యానని వివరించారు. రాయలచెరువు ప్రమాదకరంగా వుందని తెలిసినపుడు కనీసం ఇరిగేషన్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు పరిశీలించి ఫలానా చర్యలు తీసుకుంటున్నామనీ, ఎలాంటి ప్రమాదం వుండబోదని ప్రజలకు భరోసా కూడా ఇవ్వలేకపోయారని చంద్రబాబు ఆరోపించారు. తాము అవిలాల చెరువు బ్యూటిఫికేషన్‌కు చర్యలు తీసుకుంటే, దానిని కూడా ఆపేశారన్నారు. 

విచారణ జరపాల్సిందే

తుమ్మలగుంట చెరువులో క్రికెట్‌ స్టేడియం నిర్మించి నీరు పక్కకు పోవడానికి కారకులెవరని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు. వరద ముంపునకు సంబంధించి ఎవరు ఎక్కడ విఫలమయ్యారో తేల్చడానికి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుల నుంచీ సకాలంలో నీటిని ఎందుకు విడుదల చేయలేదు? ఎందుకు ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టలేదో విచారించి బాధ్యులైన వారిని గుర్తించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 ఏం సాయం చేశారు?

వరద ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలోనూ, ఆ తర్వాత సహాయక చర్యల్లోనూ కూడా ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. తిరుపతి నగరంలో ఎన్టీయార్‌ ట్రస్టు వేలాది మందికి సాయం చేసిందన్నారు.ఇరిగేషన్‌, రెవిన్యూ, పోలీసు యంత్రాంగాలు సమన్వయంతో ముంపు ప్రాంతాల నుంచీ జనాన్ని బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సివుండగా తిరుపతిలో అలాంటివెక్కడా జరగలేదన్నారు. యాభై ఇళ్ళకు ఒకరు వంతున వలంటీరు వ్యవస్థ వున్నా వారేం చేశారో దేవుడికే తెలియాలంటూ వ్యాఖ్యానించారు. మనిషి చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించడం కుటుంబ బాధ్యతని,అయితే శవమే దొరక్కపోతే ఆ కుటుంబం పడే క్షోభ అనుభవించే వారికే తెలుస్తుందన్నారు. తిరుపతిలో మ్యాన్‌ హోల్‌లో పడి గల్లంతైన ల్యాంకో ఉద్యోగి సుబ్బారావు శవం కూడా వెతికి పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం వుందని మండిపడ్డారు. 

Updated Date - 2021-11-26T08:13:14+05:30 IST