దొడ్డిపల్లెలో సెరికల్చర్ షెడ్డుకు నిప్పు
ABN , First Publish Date - 2021-07-08T04:53:35+05:30 IST
పలమనేరు మండలం దొడ్డిపల్లె సమీపంలో పాపిరెడ్డి అనే రైతుకు చెందిన సెరికల్చర్ షెడ్డుకు బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టడంతో సుమారు రూ.10 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగింది.
పలమనేరు, జూల్7 : పలమనేరు మండలం దొడ్డిపల్లె సమీపంలో పాపిరెడ్డి అనే రైతుకు చెందిన సెరికల్చర్ షెడ్డుకు బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టడంతో సుమారు రూ.10 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జరావారిపల్లె పంచాయతీ కాప్పల్లె గ్రామానికి చెందిన పాపిరెడ్డికి పక్కగ్రామం దొడ్డిపల్లె సమీపంలో సెరికల్చర్ షెడ్డు ఉంది. బుధవారం తెల్లవారుజామున దుండగులు సెరికల్చర్ షెడ్డుకు నిప్పుపెట్టారు. మంటలు చెలరేగడంతో గ్రామస్థులు గమనించి పలమనేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను విస్తరించకుండా ఆర్పివేశారు. అయితే అప్పటికే షెడ్డులోని దాదాపు 300 చంద్రాంకెలు, అందులో గూళ్లుకడుతున్న పట్టుపురుగులు అగ్నికి ఆహుతి అయ్యాయి. షెడ్డు పైకప్పుగా వేసిన సిమెంట్ షీట్లు సైతం కాలిపోయాయి. ఈ ఘటనపై పాపిరెడ్డి పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ నాగరాజు ఘటనా స్థలానికి వెళ్లి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, ఉద్దేశపూర్వకంగానే సెరికల్చర్ షెడ్డుకు దుండగులు నిప్పుపెట్టినందున వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 10 లక్షల మేర నష్టపోయానని, తనకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పాపిరెడ్డి కోరుతున్నాడు.