రైతులకు అందుబాటులో వ్యవసాయ పరికరాలు

ABN , First Publish Date - 2021-07-08T06:25:53+05:30 IST

ప్రభుత్వం రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేలు) కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను గురువారం ప్రారంభించనుంది.

రైతులకు అందుబాటులో వ్యవసాయ పరికరాలు

నేడు 123 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ప్రారంభం

ఒక్క ట్రాక్టర్‌ మాత్రం హుళక్కి!


చిత్తూరు (సెంట్రల్‌), జూలై 7: ప్రభుత్వం రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేలు) కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను గురువారం ప్రారంభించనుంది. జిల్లాలో 946 ఆర్బీకేలు ఉండగా మొదటి విడతగా 123 కేంద్రాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌కు యూనిట్‌ ధర కింద రూ.15 లక్షలు మంజూరు చేసింది.  ఇందులో రూ.6 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇవ్వగా, యూనిట్‌లోని రైతుల వాటా కింద రూ.1.5 లక్షలు, బ్యాంకు ద్వారా రూ.7 లక్షలు రుణం ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్‌లో ఐదుగురు రైతులు ఉంటారు.  ప్రతి  కస్టమ్‌ హైరింగ్‌  సెంటర్‌లో రోటోవేటర్లు, మల్టీ క్రాఫ్‌ క్రషర్‌, చాప్‌కట్టర్‌, కల్టివేటర్‌, పవర్‌ వీడర్స్‌, పవర్‌ స్ర్పేయర్లు, సీడ్‌ డ్రిల్స్‌, బ్యాటరీ ఆపరేటింగ్‌ స్ర్పేయర్లు, ప్యాడీ బ్యాలర్స్‌, రీఫర్స్‌ (వరి కోసే యంత్రాలు) వంటి 15 రకాలైన వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచనున్నారు. వీటికి అద్దె నిర్ణయించే అధికారం ఆయా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌లోని యూనిట్‌ సభ్యుల (ఐదుగురు రైతులు)కు అప్పగించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం రైతు భరోసా కేంద్రాల్లోని సిబ్బందికి అప్పగించారు. కాగా సాగులో ముఖ్యమైన ట్రాక్టర్లను కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌లో అందుబాటులోకి తేకపోవడంపై రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-07-08T06:25:53+05:30 IST