గంజాయి ఖిల్లాగా మారిన ఆలయాల జిల్లా

ABN , First Publish Date - 2021-06-21T07:45:44+05:30 IST

ఆలయాల జిల్లాగా..

గంజాయి ఖిల్లాగా మారిన ఆలయాల జిల్లా
తిరుపతి రుయా ఆవరణలోని మత్తు పదార్థాల వ్యసన నిర్మూలన విభాగం

గంజాయిమయం

కరోనా కాలంలో పెరిగిన వినియోగం   

మత్తులో జోగుతున్న యువత                                                    

మద్యం కన్నా చవకకావడంతో బానిసలవుతున్న పేదజనం


‘‘ప్లీజ్‌... ఒకే ఒక్క జాయింట్‌.. ఒక్కటంటే ఒక్కటే ఇవ్వండి... మీకు ఏమి కావాలంటే అది ఇస్తా... ఎప్పుడూ చేర్చే దగ్గరకే పంపండి..ప్లీజ్‌..ప్లీజ్‌..’’ బీటెక్‌ చదువుతున్న అమ్మాయి పంపిన మెసేజ్‌ ఇది. గంజాయికి అలవాటుపడ్డ ఆమె దానికోసం తపిస్తూ తనకి ఎప్పుడూ గంజాయి అందించే యువకులకు వరుస మెసేజ్‌లు పంపింది. ఆమె ఆరాటం, తపన ఆ యువకులకు ఒక అవకాశంగా మారింది. డబ్బులు దండుకుంటూనే తిరుపతిలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన ఆమె జీవితాన్ని ఛిద్రం చేశారు. 


అతను ఎమ్మెస్సీ చదువుతున్నపుడు సరదాగా స్నేహితులతో కలిసి గంజాయి తీసుకున్నాడు. ఆ తర్వాత అది అలవాటుగా మారింది. తనలాగే ఎందరికో గంజాయి అలవాటు ఉందని గ్రహించాడు. దీన్నే ఉపాధిగా మార్చుకున్నాడు. వైద్య కోర్సు చేసిన మరొక స్నేహితుడిని కలుపుకుని గంజాయి అమ్మడం మొదలు పెట్టాడు. యూనివర్శిటీలు, వృత్తి విద్యా కాలేజీల దగ్గర కాపు కాయడం, స్నేహాలు పెంచుకోవడం, గంజాయి అలవాటు చేసి బానిసలుగా మార్చి వ్యాపారం చేయడం.. చివరికి ఒక రోజు ఆ స్నేహితులిద్దరూ పోలీసులకు దొరికిపోయారు. బంగారు భవిష్యత్తును బలి చేసుకున్నారు. 


రెక్కల కష్టం ఎంత చేసినా బిడ్డల అవసరాలకు సరిపడే సంపాదన లేదు. నిరాశలో ఉన్న ఆమెకు గంజాయి ఒక ఆదాయ మార్గంగా దొరికింది. కొని, అవసరమైనవాళ్లకు అమ్మడం మొదలు పెట్టింది. డబ్బులు బాగానే రావడంతో తన కొడుకునీ దీంట్లోకి దించింది. ఇద్దరూ పోలీసులకు ఒక రోజు దొరికిపోయారు. ఆశకుపోయి కన్నబిడ్డ భవిష్యత్తునే జైలుపాలు చేసింది. తిరుపతి రూరల్‌ మండల పరిధిలో  ఈ సంఘటన జరిగింది.


అతను బీటెక్‌ చేశాడు. ఉద్యోగం రాలేదు. పేద కుటుంబం. ఆ ఒత్తిడిలోంచి బయటపడడానికి గంజాయికి బానిసయ్యాడు. అతనికి గంజాయి అందించేవారు ఆ యువకుడి అవసరాన్ని గుర్తించారు. గంజాయి ప్యాకెట్లు చెప్పినచోటకి చేరిస్తే చాలు వేలల్లో ముట్టజెపుతామన్నారు. కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాలకు టూవీలర్‌లో అతను కిలో ప్యాకెట్లను తీసుకువెళ్తుంటాడు. వెళ్లే రాష్ట్రాన్ని బట్టీ నెంబర్‌ ప్లేట్‌ను మార్చేస్తుంటాడు. విలాసవంతమైన వస్తువులు ఇంట్లోకి వస్తున్నా తల్లిదండ్రులు గుర్తించలేదు. కొడుకు పోలీసులకు దొరికిపోయాక గానీ నిజం వారికి తెలియలేదు.


తిరుపతి సిటీ: ఆలయాల జిల్లాగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్ధాల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా మొదలయ్యాక వినియోగం, వ్యాపారం పెరిగాయి.  తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె, నగరి, చిత్తూరు ప్రాంతాల్లో గంజాయి వాడకం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాలు, నగరాల్లోని యువకులే ఎక్కువగా గంజాయి వాడకానికి అలవాటు పడుతున్నారు.  ఒక్క తిరుపతి నగరంలోనే సుమారు 4 వేలమందికి పైగా యువత గంజాయి వాడుతున్నట్లు గుర్తించారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల మందికి పైగా గంజాయి వాడుతున్నట్లు అంచనా. ఇక గంజాయి అమ్మేవారు జిల్లాలో 2 వేలమందికి పైగా  ఉన్నట్లు సమాచారం. గంజాయికి అలవాటు పడిన వారు అది దొరకని సమయంలో నిద్రమాత్రలు, పెయింట్‌, పెట్రోలు, వైట్‌నర్‌, నెయిల్‌ పాలిష్‌ను తుడిచే రసాయనాలను కడా పీల్చి ఆ మత్తులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.


గంజాయి అంటే సాధువులు, బైరాగులు, బిక్షగాళ్లు తాగే మత్తుపదార్థం అనుకునేవారు ఒకప్పుడు. చదువుకునే పిల్లలు, నిరుద్యోగ యువత ఇప్పుడు దీనికి బానిసలవుతున్నారు. ఏడాదిన్నరగా లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల కాలంలో గంజాయి వాడకం బాగా పెరిగింది. కాలేజీలు లేకపోవడంతో యువత స్నేహితులతో కలిసి ఊరికి దూరంగా ఉండే ప్రదేశాల్లో కలవడం గంజాయి పరిచయం కావడానికి ఒక కారణం అయ్యింది. తొలి రోజుల్లో స్నేహితులతో పార్టీల్లో సరదాగా మొదలుపెడతారు. తర్వాత కొద్ది రోజులకే అది అలవాటుగా మారిపోతుంది. చివరికి అవసరంగా తేలుతుంది. గంజాయి తాగకపోతే నరాలు పీకుతూ ఉంటాయి. మనసంతా చికాకుగా మారుతుంది. ఇంట్లో అందరిమీదా అరుస్తూ నిద్రలేని రాత్రులను గడుపుతారు. ఈ స్థితిలో ఎంత డబ్బయినా పెట్టి గంజాయి కొనడానికి పూనుకుంటారు. ఒక్కోసారి డబ్బు అవసరం కోసం గంజాయి వ్యాపారంలో భాగం అయిపోతారు. తమకు తెలియకుండానే గంజాయి మాఫియా వలలో చిక్కుకుపోతారు. దీనికితోడు మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, మద్యానికి బానిసలైన కూలీలు కూడా తక్కువ ధరకే దొరుకుతున్న గంజాయి వైపు దృష్టిసారిస్తున్నారు. 


కోడ్‌నేమ్స్‌

గంజాయి తాగేవారు, అమ్మేవారు అనేక కోడ్‌నేమ్‌లతో దీనిని పిలుచుకుంటారు. గంజా, చరస్‌, హాస్‌, జాయింట్‌, స్టోన్‌, వీడ్‌, గ్రాస్‌, పాట్‌ ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకుంటున్నారు. ఫోన్‌లో మాట్లాడినా, మెసేజ్‌లు పెట్టినా, చాటింగ్‌ చేసినా కోడ్‌నేమ్‌ ఉంటుంది. ఇంట్లో పెద్దలు చూసినా వాళ్లకి అర్ధం కాదు. 


రేణిగుంట కేంద్రంగా

గంజాయిని ఎక్కువగా విశాఖపట్నం జిల్లా పాడేరు, అరకు ప్రాంతాల్లో పండిస్తారు. అక్కడ నుంచి వివిధ మార్గాల్లో అనేక ప్రాంతాలకు తరలిస్తుంటారు. నేరుగా చిత్తూరు జిల్లాకు చేర్చకుండా నెల్లూరు, కడప జిల్లాల్లో నిల్వ చేసి, అక్కడి నుంచీ తిరుపతికి పంపుతారు. రేణిగుంట ఇందుకు ఒక ప్రధాన కేంద్రంగా ఉపయోగపడుతోందని అంటున్నారు. రేణిగుంట నుంచి తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చేరుతోందని తెలుస్తోంది.  రేణిగుంటతోపాటు కరకంబాడి, మంగళం, ఆటోనగర్‌ ప్రాంతాలను స్టాక్‌ పాయింట్లుగా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. స్టాక్‌ పాయింట్లనుంచి నమ్మకస్తులద్వారా రీటైల్‌ అమ్మకాలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. సమయం, సందర్భం, డిమాండ్‌నుబట్టి 6 గ్రాముల ప్యాకెట్‌ గంజా రూ. 200 నుంచి రూ. 500  వరకు విక్రయస్తున్నారు. తల్లిదండ్రులూ.. టీనేజ్‌ పిల్లల్ని గమనించండి! 

మత్తునుంచి యువతను కాపాడడం తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రధానంగా ఉంది. యుక్త వయసులో పిల్లల కదలికలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వారి ప్రవర్తన, పెడుతున్న ఖర్చులు వంటివి పరిశీలించాలి.  తేడా ఉంటే ఆరా తీయాలి. ఇలా చేస్తే యువత చెడు దారి పట్టకుండా తొలి అడుగులోనే అడ్డుకోవచ్చు. గంజాయి వాడకాలను, విక్రయాలను అరికట్టేందుకు నిఘా బృందాలను పెట్టి మేము చేయాల్సినవన్నీ చేస్తున్నాం. దాడులు చేస్తున్నాం. అరెస్టు చేస్తున్నాం.అయితే తల్లిదండ్రులు తొలి దశలోనే గుర్తించకపోతే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇక ప్రజలు కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ అలాంటి సమాచారం తెలిస్తే వెంటనే మాకు తెలియజేయడం వలన వీటిని అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది.జీవితాలను నాశనం చేసుకుంటున్నారు 

ఒకరు మత్తుకు అలవాటుపడితే అ పర్యవసానం పలువురిపై పడుతుంది. ప్రధానంగా వారి కుటుంబ సభ్యులపై ఎక్కువగా పడుతుంది. మత్తును తీసుకున్న సమయంలో వారి శరీరం, మెదడు పూర్తిగా అదుపు తప్పుతుంది. ఆ సమయంలో వారు నేరాలకు, ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇలాంటి వారిని మొదట వారి తల్లిదండ్రులే గుర్తించి వారిపై పర్యవేక్షణ ఉంచాలి.  మత్తు వలన ఎదురయ్యే పరిణామాల గురించి అవగాహన కల్పించి అవసరం అయితే వైద్యం చేయించాలి. మా దగ్గరకు వైద్యం కోసం వచ్చే వారిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. మత్తు వ్యసనాల నుంచి కోలుకున్న తరువాత వారు ఏమి కోల్పోయారో తెలుసుకుని పడే బాధ వర్ణనాతీతం. వైద్యంతోపాటు కౌన్సెలింగ్‌ అవసరం 

మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి వైద్యం అందించి మత్తుకు దూరం చేసినా మళ్లీ ఏదో ఒక సందర్భంలో ఆ మత్తుకు అలవాటు పడే అవకాశాలు ఉంటాయి. దీంతో వారికి వైద్యంతోపాటు కౌన్సెలింగ్‌ ఎంతో అవసరం. అప్పుడే వారు మత్తులో ఏం కోల్పోయారు. ఎలా జీవించారు. ప్రస్తుతం ఎలా ఉన్నారు అనే విషయాలను తెలుసుకుంటారు. తరువాత మత్తుకు దూరంగా ఉంటారు. ఇప్పటికే వైద్యంతోపాటు కౌన్సెలింగ్‌ వలన 3 వేల మంది వరకు మత్తుకు దూరంగా ఉన్నారు.భూమన పోరాటం

తిరుపతి నగరంలో గంజాయి ఏరివేతకు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అర్బన్‌ ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడంతోపాటూ రోజూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ గంజాయి మత్తులో ఉన్నవారిని గుర్తించి పోలీసులకు పట్టిస్తున్నారు. ఇందుకోసం ఆయన తన వేషధారణనే మార్చుకున్నారు. ఎప్పుడూ తెల్లటి గుడ్డల్లో కనిపించే భూమన, రంగు రంగుల చొక్కాల్లో సాధారణ జనంలో కలిసిపోయి ఒంటరిగా తిరుగుతున్నారు. ఒక్కోసారి సైకిల్‌ మీద కనిపిస్తున్నారు.శ్మశానాలు, పాడుబడ్డ భవనాలున్న ప్రదేశాల్లో యువకులు కనిపిస్తే వెంటబడుతున్నారు. దీంతో పోలీసులు కూడా గంజాయి అంశాన్ని తీవ్రంగా పరిగణించి లింకులు తెగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 


తిరుపతిలో ఎక్కడెక్కడ?

తిరుపతి నగరంలో జీవకోన, ఇందిరానగర్‌, ఎస్‌టీవీ నగర్‌, స్కావెంజర్స్‌ కాలనీ, ఆటోనగర్‌, ఎస్వీనగర్‌, పల్లెవీధి,  గ్రూప్‌ థియేటర్స్‌  సమీపం, సింగాలగుంట, జీవకోన, ఆటోనగర్‌ ప్రాంతాలు గంజాయి కేంద్రాలుగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇంకా సమీపంలోని అవిలాల, దామినేడు, తారకరామనగర్‌ ప్రాంతాల్లో కూడా గంజాయి వినియోగం, విక్రయాలు ఉన్నాయంటున్నారు.


గత ఆరు నెలల కాలంలో జిల్లాలో సుమారు 30కి పైగా గంజాయి కేసులు నమోదయ్యాయి. 10 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 50మందిని అదుపులోకి తీసుకున్నారు.


గంజాయి లాంటి మాదకద్రవ్యాల నివారణకు అదనపు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఏర్పాటు చేశారు.టా్‌స్కఫోర్స్‌ సమాచారం ఆధారంగా జిల్లాలో 67మందిని గంజాయి విక్రేత అనుమానితులుగా గుర్తించి కేసులు నమోదు చేశారు. 


తిరుపతి నగర పరిధిలోని 27 డివిజన్లలో గంజాయి విక్రయాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ డివిజన్లలోని యువకులు గంజాయికి బానిసలుగా మారుతున్నారని, వెంటనే గంజాయి విక్రయాలను అడ్డుకోవాలని కోరుతూ కౌన్సిలర్లు గత నెల 4న తిరుపతి కార్పొరేషన్‌ సమావేశంలో మేయర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు.


గంజాయి, మద్యం, పొగాకు ఉత్పత్తులు వంటి పలు రకాల మత్తు వ్యసనాలకు అలవాటు పడిన వారికి ఆ మత్తు నుంచి విముక్తులను చేసేందుకు తిరుపతిలోని రుయా ఆవరణలో గత ఏడాది మేలో ప్రభుత్వం మత్తు పదార్థాల వ్యసన నిర్మూలన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఏడాది కాలంలోనే ఇందులో 4,800 మందికి వైద్యం అందించారు. వీరిలో 50 శాతానికి పైగా గంజాయికి బానిసలు.  30 శాతం మంది మద్యానికి,  20 శాతం మంది ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా గుర్తించారు.  వీరిలో 16 నుంచి 25 నడుమ వయస్సు కలిగిన వారే ఎక్కువగా ఉన్నారు.


Updated Date - 2021-06-21T07:45:44+05:30 IST