ముగ్గురు మైనింగ్‌ శాఖ అధికారులపై విచారణకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2021-02-06T07:35:27+05:30 IST

గనులు, భూగర్భ శాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై విచారణకు రంగం సిద్ధమైంది.

ముగ్గురు మైనింగ్‌ శాఖ అధికారులపై విచారణకు రంగం సిద్ధం

కలికిరి, ఫిబ్రవరి 5: గనులు, భూగర్భ శాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై విచారణకు రంగం సిద్ధమైంది. గతంలో పలమనేరు మైనింగ్‌ శాఖలో అసిస్టెంట్‌ డెరెక్టరుగా పనిచేసి ప్రస్తుతం కర్నూలు జిల్లా శ్యాండ్‌ అధికారిగా పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న ఎస్‌. సాయిరాంసింగ్‌, చిత్తూరు మైనింగ్‌ శాఖలో ఏడీగా పనిచేసి ప్రస్తుతం అనంతపురం శ్యాండ్‌ అధికారిగా పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న జి. వెంకటేశ్వర్లు, కడప జిల్లా మైనింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ (ఈయనా సస్పెన్షన్‌లో వున్నారు) సి. మోహన్‌ రావుకు అభియోగ పత్రాలు జారీ చేసింది. ప్రధానంగా కడప డీడీ మోహన్‌రావు తన పరిధులను అతిక్రమించి చిత్తూరు జిల్లాలో అక్రమంగా 50 మైనింగ్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. 2019 జూలై 10 నుంచి 2020 జూలై 27 మధ్య చిత్తూరు జిల్లాలో 50 మైనింగ్‌ పథకాలను ఆమోదించారని పేర్కొంది. కడప మైనింగ్‌ శాఖ డీడీగా పనిచేస్తూ చిత్తూరు డీడీ పరిధిలో ఈ మైనింగ్‌ పథకాలను మంజూరు చేయడం దాన్ని పలమనేరు, చిత్తూరు ఏడీలు సాయిరాం సింగ్‌, వెంకటేశ్వర్లు అమలు చేయడం తీవ్రమైన తప్పిదాలుగా పేర్కొంది. ఈ అక్రమాలపై విచారణ సాగనుందని దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ (విజిలెన్స్‌) ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-02-06T07:35:27+05:30 IST