రెండోరోజు కొనసాగిన ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2021-12-09T05:50:07+05:30 IST
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు రెండోరోజు బుధవారం కూడా నిరసన కొనసాగించారు. ఆయా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కార్యాలయాలకు హాజరయ్యారు.

చిత్తూరు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు రెండోరోజు బుధవారం కూడా నిరసన కొనసాగించారు. ఆయా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కార్యాలయాలకు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని ఎంపీడీవో, తహసీల్దారు కార్యాలయాలతో పాటు జిల్లా కార్యాలయాల ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు ఇంటి నుంచే నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు గంటా మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాకాల మండలం దామలచెరువులో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆయా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తాము పనిచేస్తున్న కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి పోస్టర్లు ఆవిష్కరించారు.