పంట పొలాలపై కొనసాగుతున్న గజదాడులు
ABN , First Publish Date - 2021-07-09T04:57:08+05:30 IST
వి.కోట మండల అటవీ సరిహద్దు గ్రామాల్లో గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వారం రోజులుగా ఏనుగులు మూడు గుంపులుగా విడిపోయి పంటపొలాలపై దాడులు చేస్తున్నాయి.

వి.కోట, జూలై 8: వి.కోట మండల అటవీ సరిహద్దు గ్రామాల్లో గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వారం రోజులుగా ఏనుగులు మూడు గుంపులుగా విడిపోయి పంటపొలాలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా 14 ఏనుగులు కైగల్ అటవీ ప్రాంతం నుంచి శ్రీకార్లపల్లె, కుమ్మరమడుగు, నాగిరెడ్డిపల్లె, వెంకటేపల్లె, దండికుప్పం ప్రాంతాల్లో పొలాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. బుధవారం రాత్రి కుమ్మరమడుగు పరిసరాల్లో వంకాయ, టమోటా, బీన్స్, చిక్కెడు, మామిడి తోటల్లో పంటలను తిని తొక్కి నాశనం చేశాయి. శ్రీకార్లపల్లె పరిసరాల్లో అరటి, మామిడి, టమోటా తోటను నష్టపరిచింది. ట్రాకర్స్ సాయంతో ఏనుగులను కర్ణాటక వైపు దారి మళ్ళించారు. అయితే అక్కడి అటవీశాఖ వారు వాటిని దారి మళ్ళించడంతో అవి తిరిగి వి.కోట వైపు మళ్ళాయి. కస్తూరినగరం నర్సరీ వద్ద జాతీయ రహదారిని దాటి దండికుప్పం అటవీ ప్రాంతంలోనికి ప్రవేశించాయి. మరో వైపు పంట నష్టాన్ని అటవీ అధికారులు పరిశీలించి అంచనాలను సిద్దం చేస్తున్నారు.