ఆగని గజదాడులు
ABN , First Publish Date - 2021-01-12T06:19:02+05:30 IST
యాదమరి మండల పరిధిలో గజదాడులు ఆగడం లేదు.

యాదమరి, జనవరి 11: యాదమరి మండల పరిధిలో గజదాడులు ఆగడం లేదు. ఆదివారం రాత్రి పేరగాండ్లపల్లె సమీపంలో వరి, చెరకు, అరటి, మామిడి పంటలను 13 ఏనుగుల గుంపు ఽధ్వంసం చేశాయి. సోమవారం పంట నష్టాన్ని ఎఫ్‌ఆర్‌వో సుభాష్, డీఆర్‌వో శివరాం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులు అటవీ ప్రాంత సమీపంలో సోలార్ కంచె వేయించాలని కోరారు. సగం రైతులు భరిస్తే సగం ప్రభుత్వం నుంచి పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం సాయంత్రానికి కృష్ణాపురం-పేరగాండ్లపల్లె మధ్య అటవీప్రాంతంలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ట్రాకర్ల సాయంతో పంటపొలాల వైపు ఏనుగులు రాకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.