విద్యుత్‌షాక్‌తో ఏనుగు మృతి

ABN , First Publish Date - 2021-08-20T06:52:35+05:30 IST

నెలరోజులుగా సోమల మండలంలో పంటపొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తూ వచ్చిన ఒంటరి ఏనుగు విద్యుత్‌షాక్‌తో చనిపోయింది.

విద్యుత్‌షాక్‌తో ఏనుగు మృతి
ఏనుగు కళేబరాన్ని పరిశీలిస్తున్న అధికారులు

సోమల, ఆగస్టు 19: నెలరోజులుగా సోమల మండలంలో పంటపొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తూ వచ్చిన ఒంటరి ఏనుగు విద్యుత్‌షాక్‌తో చనిపోయింది. అన్నెమ్మగారిపల్లె పంచాయతీ బోనమంద సమీపంలో  వెంకటస్వామి అనే రైతుకు చెందిన బొప్పాయి తోటలోకి బుధవారం రాత్రి ప్రవేశించబోయి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.నెల రోజులుగా ఈ ఏనుగు ఒంటరిగానే  సంచరించేది.ఇటీవల దీనికి రెండు ఏనుగులు జత కలిసి పేటూరు, బోనమంద, పొలికిమాకులపల్లె, అన్నెమ్మగారిపల్లె, బసవపల్లె, ఇర్లపల్లె గ్రామశివార్లలోని మామిడి, బొప్పాయి, టమోటా, వరి పొలాల్లో సంచరించి పంటలను తీవ్రంగా నష్టపరిచాయి. కనికల చెరువు, ఇర్లపల్లె చెరువు సమీపంలోనే తిష్ట వేశాయి. ఒంటరి ఏనుగు రెండు రోజులుగా బోనమంద సమీపంలో సంచరిస్తూ వచ్చింది. బుధవారం రాత్రి బొప్పాయి తోటలోకి దూరబోయి విద్యుత్‌ తీగలు తగిలి మృతి చెందింది.డీఎఫ్‌వో రవిశంకర్‌,ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్‌ శ్యాంప్రసాద్‌రెడ్డి, డీటీ రమేశ్‌, ట్రాన్స్‌కో ఏఈ రాంప్రసాద్‌రెడ్డి, ఎల్‌ఐ వీవీ రమణ ఘటనా స్ధలం చేరుకుని ఏనుగు మృతికి సంబంధించి కారణాలపై రైతులతో మాట్లాడారు. తిరుపతి జూపార్క్‌  అధికారి తోయిబాసింగ్‌, పశువైద్యాధికారి చందనప్రియ  పోస్ట్‌మార్టం నిర్వహించారు.నెల రోజులుగా ఏనుగుల  సంచారంతో పంటలు నష్టపోయామని అటవీ అధికారుల ఎదుట పలువురు రైతులు వాపోయారు. నష్ట పరిహారం మంజూరు చేయాలని వైసీపీ మండల అధ్యక్షుడు గంగాధరం, సర్పంచులు డిమాండ్‌ చేశారు. మండలంలో సంచరిస్తున్న మరో రెండు ఏనుగుల నుంచి పంటలను కాపాడాలని కోరారు.  

Updated Date - 2021-08-20T06:52:35+05:30 IST