తిరుపతి ప్రైవేటు ఆస్పత్రుల్లో నేడు నో ఆక్సిజన్‌

ABN , First Publish Date - 2021-05-02T06:58:57+05:30 IST

విశాఖ నుంచి తిరుపతికి చేరాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకు ఆదివారం రావటం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

తిరుపతి ప్రైవేటు ఆస్పత్రుల్లో నేడు నో ఆక్సిజన్‌

తిరుపతి, మే 1 (ఆంధ్రజ్యోతి): విశాఖ నుంచి తిరుపతికి చేరాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకు ఆదివారం రావటం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు తెలియజేశాయి. కనీసం చెన్నై నుంచి అయినా తెప్పించాలని, ప్రాణనష్టం జరిగితే తాము బాధ్యులు కాదని కూడా స్పష్టం చేశాయి.   తిరుపతిలోని ప్రైవేటు ఆస్ప్రతులు ఏ రోజుకారోజు ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పేడు వద్ద ఉన్న కేంద్రం నుంచి ఫిల్‌ చేసుకుని తెచ్చుకుంటాయి. రుయా, స్విమ్స్‌లో వలె భారీ సిలెండర్లున్న ఆస్పత్రులకు మాత్రం ఒక రోజు సప్లయ్‌ లేకపోయినా నెట్టుకురాగలవు. చిన్న సిలిండర్లను ఫిల్‌ చేసుకుని ఆక్సిజన్‌ అందిస్తున్న ఆస్పత్రులకు మాత్రం ఒక్కరోజు ఆక్సిజన్‌ విశాఖ నుంచి రాకపోయినా ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎలా గడుస్తుందో అన్న ఆందోళనలో వైద్యులున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-02T06:58:57+05:30 IST