‘మట్టి పరీక్ష’లకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-05-24T06:42:07+05:30 IST

నిధుల కొరతతో జిల్లాలోని వ్యవసాయ భూముల్లో మట్టి పరీక్షలకు బ్రేక్‌పడింది.

‘మట్టి పరీక్ష’లకు బ్రేక్‌

(చిత్తూరు, ఆంధ్రజ్యోతి): మట్టిసారాన్ని తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు ఎరువులు వాడితే పంట దిగుబడులు పెరుగుతాయి - ఇదీ వ్యవసాయ అధికారుల మాట. 

  గత ప్రభుత్వ హయాంలో ఏటా రూ.50 లక్షల వరకు నిధులు కేటాయించేవారు. ప్రతి గ్రామంలో, ప్రతి రైతు పొలంలో మట్టి నమూనాలను తీసి పరీక్షలు చేసేవారు. ఇలా 2018-19 వరకు జరిగింది. 2019-20 సంవత్సరంలో మండలానికి ఓ గ్రామం చొప్పున 65 నమూనాలను మాత్రమే పరీక్షించారు. గతేడాది ఆ మాత్రం నిధులూ ఇవ్వలేదు. దీంతో అన్ని కేంద్రాల్లో మట్టి పరీక్షలు నిలిచిపోయాయి. - ఇదీ క్షేత్రస్థాయి పరిస్థితి.

   మట్టి పరీక్షలను ప్రభుత్వం పక్కన పెట్టింది. వీటికోసం గతేడాది, ఇప్పుడూ నిధులు మంజూరు చేయలేదు. తిరుపతిలో జిల్లా స్థాయి.. చిత్తూరు, మదనపల్లె, కుప్పం, శ్రీకాళహస్తి వంటి ప్రాంతాల్లో డివిజన్‌ స్థాయి భూసార పరీక్షా కేంద్రాలున్నాయి. గత ప్రభుత్వంలో ఖరీఫ్‌కు ముందుగానే అధికారులు మట్టి నమూనాలను సేకరించి.. పరీక్షించేవారు. భూసారంలో లోపాలను రైతులకు ఫోన్‌ మెసేజ్‌ లేదా కార్డుల ద్వారా తెలియజేసేవారు. వీటిని అధిగమించేందుకు ఏ మోతాదులో ఎరువులు వాడాలో, ఇతరత్రా ఏ చర్యలు తీసుకోవాలో అధికారులు వివరించేవారు. ఇలా ఏటా సుమారు 60 వేల నమూనాలను పరీక్షలకు పంపేవారు. ఎవరైనా రైతులు మట్టి నమూనాలను ప్రత్యేకంగా తీసుకెళ్తే రూ.10 రుసుంతో పరీక్ష చేసేవారు. మట్టి సేకరణకు ఏప్రిల్‌, మే నెలలు అనుకూలం. ఇప్పుడు పరీక్షిస్తే ఖరీఫ్‌ మొదలయ్యే నాటికి ఫలితాలు వస్తాయి. ఇలా 2018-19 వరకు చేశారు. 2020లో పరీక్షలు చేయలేదు. 2018-19 కార్డుల్లో చూపినట్లే ఎరువులు వాడుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. పోనీ ఈ ఏడాదైనా నమూనాలు సేకరిస్తారా అని రైతులు అడిగితే ప్రభుత్వం నుంచి సమాచారం లేదంటున్నారు. మే నెల మూడు వారాలు పూర్తయినా భూ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం రాలేదు. 


కరోనా అని ఆపేశారు 

2018-19 వరకు రైతు నమూనాలను సేకరించేవారు. 2019-20లోనూ పైలెట్‌ ప్రాజెక్టులా మండలానికో గ్రామంలో పరీక్షలు చేశాం. ఓసారి వచ్చిన ఫలితం మూడేళ్ల వరకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కరోనా అధికంగా ఉన్న కారణంగా తాత్కాలికంగా ఈ పరీక్షలు చేయడం లేదు. దీనికి నిధులూ రాలేదు. మట్టి పరీక్షలు అవసరమున్న రైతులు నమూనాలు తీసుకొస్తే విశ్లేషణ చేసి పంపిస్తాం.

- జ్యోతిర్మయి, ఏడీఏ, తిరుపతి భూసార పరీక్షా కేంద్రం

Updated Date - 2021-05-24T06:42:07+05:30 IST