వైసీపీ బెదిరింపులకు భయపడొద్దు

ABN , First Publish Date - 2021-10-31T07:36:07+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పం ప్రజలిచ్చే తీర్పు రాష్ట్రానికే కనువిప్పు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ బెదిరింపులకు భయపడొద్దు

మీరిచ్చే గెలుపు రాష్ట్రానికే కనువిప్పు 

కుప్పం ప్రజలకు చంద్రబాబు పిలుపు


కుప్పం రూరల్‌, అక్టోబరు 30: మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పం ప్రజలిచ్చే తీర్పు  రాష్ట్రానికే కనువిప్పు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కక్ష కట్టే అధికార పక్షం ఇక్కడి మేజర్‌ పంచాయతీని మున్సిపాలిటీ చేసి ప్రజలపై పన్నుల భారం మోపిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపాలిటీలో శనివారం విస్తృతంగా పర్యటించిన ఆయన వైసీపీ నేతల అవినీతిపై ధ్వజమెత్తారు.లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు జరిపిన ఆయన ప్రచారం ప్రారంభించారు.అదనపు పన్నుల భారం పడకూడదని తాను ఆగితే రాజకీయాల కోసమే వైసీపీ నేతలు మున్సిపాలిటీ చేసి మనతో ఆడుకుంటున్నారన్నారు.ఇప్పుడు చెత్తకు పన్ను, ఎప్పుడో ఇచ్చిన ఇండ్లకు పన్ను, ఆఖరుకు మనం వాడే మరుగుదొడ్లకు కూడా పన్ను.... ఎవ్వరూ పన్నులు కట్టొద్దు. మనం తిరిగి అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేసి ఇళ్లను అప్పగించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.ఇసుక, మద్యం ద్వారా సంపాదించి వైసీపీ వారిచ్చే అవినీతి సొమ్ముకు ఆశపడి అమ్ముడు పోతే  భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో మోసపోయానని, తాను కూడా పుంగనూరులో తడాఖా ఏమిటో చూపిస్తానని, ముల్లును ముల్లుతోనే తీయాలన్న నిర్ణయానికి వచ్చానన్నారు. ప్రభుత్వానికి ఏజంట్ల లాగా మారిన వలంటీర్లు ఓట్లు అడుగుతారని, వేయబోమంటే  పథకాలు కట్‌ చేస్తామంటూ బెదిరిస్తారని,అయితే వాటికి బెదరాల్సిన అవసరం లేదన్నారు. వరి వేస్తే పెట్టుబడీ రాలేదని సామగుట్టపల్లెలో రైతులు చెబుతున్నారని, ఈ పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు పెడతామనడమే కాక ట్రూఅప్‌ ఛార్జీల పేరిట ప్రభుత్వం అదనపు భారం మోపుతోందంటూ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు,మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్‌,పుంగనూరు నియోజకవర్గ నేత ఎస్కే రమణారెడ్డి,,కుప్పం నియోజకర్గ ఇన్‌చార్జి పీఎస్‌ మునిరత్నం, బీసీ నాయకుడు షణ్ముగం,కుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థి త్రిలోక్‌, నాయకులు మనోహర్‌, రాజ్‌కుమార్‌,  గోపినాథ్‌, సత్యేంద్ర శేఖర్‌, వెంకటేష్‌, బాబునాయుడు, కాణిపాకం వెంకటేష్‌, సోము, రవి, ప్రతాప్‌, మునెప్ప, విశ్వనాథనాయుడు, ఆనందరెడ్డి,రామచంద్రనాయుడు, మోహన్‌రావు, సోము, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-31T07:36:07+05:30 IST