టీటీడీ ప్రధానార్చకుల మధ్య మరో వివాదం

ABN , First Publish Date - 2021-05-05T07:05:57+05:30 IST

టీటీడీ ప్రధానార్చకుల మధ్య..

టీటీడీ ప్రధానార్చకుల మధ్య మరో వివాదం

ఆధిపత్య పోరుతోనే హైకోర్టుకు..!


తిరుమల(ఆంధ్రజ్యోతి): టీటీడీ ప్రధానార్చకుల మధ్య మళ్లీ ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలంటూ ప్రస్తుత శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. తన స్థానంలో తిరిగి రమణదీక్షితులును ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ గత నెల 24న ఆయన వేసిన పిల్‌ను హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. సాధారణంగా టీటీడీలో నాలుగు మిరాశీ కుటుంబాల నుంచి నలుగురు ప్రధాన అర్చకులుగా విధులు నిర్వహిస్తారు. 65 ఏళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణ వర్తింపజేస్తూ 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని గోవిందరాజస్వామి, తిరుచానూరులోని పద్మావతి ఆలయాల్లోనూ ఈ నిబంధన అమలుచేశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులతో పాటు మూడు ఆలయాల నుంనీ దాదాపు 10 మంది మిరాశీ వంశీకులు.. మరో పది మంది నాన్‌మిరాశీ (కైంకర్యపరులు) అర్చకులు రిటైరయ్యారు.


శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా పైడిపల్లి వంశం నుంచి ఏఎస్‌ కృష్ణశేషాచల దీక్షితులు, గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల దీక్షితులు, పెద్దింటి నుంచి శ్రీనివాసదీక్షితులు, తిరుపతమ్మ నుంచి గోవిందాచార్యులను ప్రధాన అర్చకులుగా నియమించారు. టీటీడీ నిర్ణయంతో తాము దైవ కైంకర్యాలకు దూరమయ్యామంటూ పద్మావతి అమ్మవారి ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. శారీరకంగా దృఢంగా ఉన్న మిరాశీ అర్చకులను తిరిగి కొనసాగించాలని 2018 డిసెంబరులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పును తమకూ అమలు చేయాలంటూ రమణదీక్షితులు నాటి ప్రభుత్వాన్ని, టీటీడీని కోరినా చర్యలు తీసుకోలేదు. దీనిపై ఆయన ప్రభుత్వంతో పాటు టీటీడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ను ఆయన కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు.


జగన్‌ సీఎంగా అయ్యాక శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడిగా రమణదీక్షితులును నియమించారు. తనకు పూర్వస్థానమైన ప్రధాన అర్చకత్వమే కావాలంటూ ఆయన ఇన్నాళ్లు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వయోపరిమితితో విధులకు దూరమైన ప్రధాన అర్చకులతో పాటు మిగిలిన అర్చకులు కూడా హైకోర్టు తీర్పు మేరకు తమ విధులకు హాజరు కావాలంటూ గతనెల 3న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గొల్లపల్లి వంశం నుంచి రమణదీక్షితులు, తిరుపతమ్మ నరసింహదీక్షితులు, సాధారణ అర్చకుడిగా వెంకట్‌దీక్షితులు మళ్లీ చేరారు. ఆ సందర్భంలోనే సీఎం జగన్మోహన్‌రెడ్డిని రమణదీక్షితులు మహావిష్ణువుతో పోల్చిచేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపడం అందరికీ తెలిసిందే. కాగా, 2018లో గొల్లపల్లి వంశం నుంచి రమణదీక్షితులను తొలగించాక ఆ వంశం నుంచే వేణుగోపాల దీక్షితులను, తిరుపతమ్మ కుటుంబం నుంచి నరసింహదీక్షితుల స్థానంలో గోవిందరాజదీక్షితులను టీటీడీ నియమించింది. ఇప్పుడు వీరిద్దరూ తిరిగి రావడంతో ప్రధాన అర్చకులుగా ఎవరుంటారనేది చర్చనీయాంశమైంది. వీరి విధులకు సంబంధించి టీటీడీ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.


ఈ క్రమంలో రీ ఎంట్రీ అయిన వారు తామే ప్రధాన అర్చకులమంటూ సాధారణ అర్చకులకు ఇటీవల విధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రధాన అర్చకులు వేసిన డ్యూటీలకు వెళ్లాలా? లేదా తిరిగి విధుల్లోకి వచ్చిన వారి ఆదేశాలను పాటించాలా? అని సాధారణ అర్చకులు సతమతమవుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో టీటీడీలో మరోసారి అర్చకుల మధ్య ఆధిపత్యపోరు కనిపించింది. ఈ క్రమంలోనే తనకు అన్యాయం జరిగిందంటూ గొల్లపల్లి వంశం నుంచి మూడేళ్లుగా ప్రధాన అర్చకుడిగా ఉంటున్న వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వంతో పాటు టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. 

Updated Date - 2021-05-05T07:05:57+05:30 IST