వేరుశనగ రైతుకు మళ్లీ నిరాశే!

ABN , First Publish Date - 2021-10-25T06:31:40+05:30 IST

మూడేళ్లుగా వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఈ ఏడు కష్టాలు తప్పడం లేదు. అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది వేరుశనగ పంట దిగుబడి పూర్తిగా తగ్గి పోగా, మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లో ఒబ్బిళ్లు చేసిన కట్టె పొలాల్లో తడిసి పోయి పశువుల మేతగా కూడా ఉపయోగపడదని తంబళ్లపల్లె రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేరుశనగ రైతుకు మళ్లీ నిరాశే!
బురుజుపల్లెలో తడిసిపోయిన వేరుశనగ చెట్లను చూపుతున్న రైతు

తంబళ్లపల్లె, అక్టోబరు 24: మూడేళ్లుగా వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఈ ఏడు కష్టాలు తప్పడం లేదు. అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది వేరుశనగ పంట దిగుబడి పూర్తిగా తగ్గి పోగా, మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లో ఒబ్బిళ్లు చేసిన కట్టె పొలాల్లో తడిసి పోయి పశువుల మేతగా కూడా ఉపయోగపడదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడులు అందక వేలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తంబళ్లపల్లె మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో  జూన్‌ మాసంలో 2600 హెక్టార్లు, జూలైలో 1400 హెక్టారల్లో వేరుశనగ సాగు చేశారు. పంట పూత దశ నుంచి ఊడలు దిగే  వరకూ వరుస వర్షాలు కారణంగా చెట్టు ఏపుగా పెరిగింది. తీరా ఒబ్బిళ్లు చేపట్టగా చెట్టుకు మూడు, నాలుగు కాయలే ఉండటంతో ఈ ఏడాది దిగుబడిపై రైతులు ఆశలు వదిలేశారు. వేరుశనగ కట్టె పశువుల మేతగానైనా ఉపయోగపడుతుందని భావించారు. జూన్‌లో సాగు చేసిన పంటను పలు గ్రామాల్లో  వారం రోజులుగా  పెరుకుతున్నారు. కొంతమంది రైతులు  పంటను పొలాల్లోనే భద్రపరచుకోగా, మరి కొంతమంది వసతి లేక అలాగే పొలాల్లోనే వదిలేశారు. మూడు రోజులుగా మండల వ్యాప్తంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో  వేరుశనగ పంట పొలాల్లోనే తడిసి పోయింది. అసలే పంట దిగుబడి అంతంత మాత్రం ఉండటం, పెరికిన వేరుశనగ కట్టె  తడిసిపోవడంతో పశుగ్రాసానికి కూడా ఉపయోగ పడదని ఆందోళన చెందుతున్నారు. 
Updated Date - 2021-10-25T06:31:40+05:30 IST