ఆ రెండు ద్వారాలు ఎప్పుడు తెరుస్తారు?

ABN , First Publish Date - 2021-08-18T05:27:26+05:30 IST

గత ఏడాది మార్చిలో కరోనా ఉధ్రుతితో వాయులింగేశ్వరుడి క్షేత్రం రెండవ, మూడవ ద్వారాలను మూసివేశారు.

ఆ రెండు ద్వారాలు ఎప్పుడు తెరుస్తారు?
మూతపడిన శివయ్య గోపుర ద్వారం

ముక్కంటి ఆలయంలో ద్వారాల మూతపై భక్తుల ఆందోళన   


శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 17: శ్రీకాళహస్తిలో కొలువైన వాయులింగేశ్వరుడి క్షేత్రం ఎక్కడా లేనివిధంగా నాలుగు ద్వారాలతో నిర్మితమైంది.ధర్మ, అర్థ, కామ, మోక్ష మార్గాలను సూచించేలా ఆలయానికి నాలుగు మార్గాలను నిర్మించారు. భిక్షాల గాలిగోపురం వద్ద ఉన్న మొదటి ద్వారాన్ని ధర్మమార్గంగాను, శివయ్య గోపురం వద్ద ఉన్న రెండో ద్వారాన్ని అర్థ మార్గంగాను, మూడవది తిరుమంజన గోపుర ద్వారాన్ని కామ మార్గంగాను, నాలుగవదైన దక్షిణ గోపుర ద్వారాన్ని మోక్ష మార్గమని పిలుస్తారు. భక్తి, ముక్తిక్షేత్రంగా వాయులింగేశ్వరాలయం విరాజిల్లేలా వీటిని రూపొందించారు. మానవజన్మ సార్థకతకు మూలమైన చతుర్విద పురుషార్థములను పెనవేస్తూ భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేలా పూర్వీకులు నిర్మించారు.భక్తులు ఎవరికి ఇష్టమైన మార్గంలో వారు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే అధికార యంత్రాంగం అనాలోచిత నిర్ణయాలతో రెండు ద్వారాలను మూసివేసి అనాదిగా వస్తున్న ఆచారాన్ని విస్మరించడంపై ముక్కంటి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాది మార్చిలో కరోనా ఉధ్రుతితో రెండవ, మూడవ ద్వారాలను మూసివేశారు. కొవిడ్‌ ఉధ్రుతి తగ్గాక ఈ ద్వారాలను తెరుస్తారని భక్తులు ఆశించినా జాప్యం జరుగుతోంది.ఆయా మార్గాల్లో భక్తులు రాకపోవడంతో దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల కిందట మాస్టర్‌ప్లాన్‌ అమలుతో నిర్వాసితులైన వీరందరూ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. 


భక్తులకు తప్పని పాట్లు

పట్టణంలోని భక్తకన్నప్ప వంతెన నుంచి మూడవ మార్గం వద్దకు స్వామి దర్శనార్థం భక్తులు అధికంగా వస్తుంటారు. ఈ మార్గం సులభతరంగా ఉన్నా, వెళ్లేందుకు అవకాశం లేక నాలుగవ మార్గం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతం వాహనాల రద్దీతో నిండి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండవ మార్గం వద్ద విశాలమైన పార్కింగ్‌ కు అవకాశమున్నా ఈ ద్వారం మూసివేశారు. దీంతో ఇక్కడి నుంచి భక్తులు నడుచుకుంటూ ఒకటవ మార్గం వద్దకు చేరుకోవడంతో రద్దీ నెలకొంటోంది. ఒకటవ మార్గం ద్వారా ప్రవేశించిన భక్తులు వాయులింగేశ్వరుడి దర్శనానంతరం ప్రసాదం కోసం నాలుగవ మార్గం మీదుగా వెలుపలకు రావాల్సి ఉంది. ఈ మధ్యన మరో మార్గం లేక నాలుగవ ద్వారం నుంచి ఒకటో మార్గం వరకు పాదరక్షల్లేకుండా ఎండావానకు ఇబ్బందులు పడుతూ భక్తులు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇకనైనా అధికారులు భక్తుల అవస్థలు గుర్తించి మూసిన ద్వారాలను తెరిచి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. 



Updated Date - 2021-08-18T05:27:26+05:30 IST