డేంజర్ బెల్... సెకండ్ వేవ్
ABN , First Publish Date - 2021-03-24T06:01:33+05:30 IST
సెకండ్ వేవ్... ఏడాది తర్వాత కూడా మనల్ని వదలని బొమ్మాళి. నెలలకు నెలలు గడగడలాడించి, ప్రాణాలు తీసి, జనజీవనాన్ని స్తంభింపజేసి..నెమ్మదించింది ఇక అనుకునేలోగా మళ్ళీ జూలు విదిలిస్తోంది.

జిల్లాలో కరోనా తొలి కేసు నమోదై నేటికి ఏడాది!
ఏడాదిలో లక్షకు చేరువైన కేసులు, 866 మరణాలు
తాజాగా పెరుగుతున్న కేసులు, మరణాలు
జనంలో నిర్లక్ష్యం, యంత్రాంగం ఉదాసీనత
తిరుపతి-ఆంధ్రజ్యోతి:
సెకండ్ వేవ్... ఏడాది తర్వాత కూడా మనల్ని వదలని బొమ్మాళి. నెలలకు నెలలు గడగడలాడించి, ప్రాణాలు తీసి, జనజీవనాన్ని స్తంభింపజేసి..నెమ్మదించింది ఇక అనుకునేలోగా మళ్ళీ జూలు విదిలిస్తోంది. జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదై నేటికి సరిగ్గా ఏడాది. బతుకుని బీభత్సం చేసి వదిలేసిందనుకున్న భూతం వెంటాడుతూనే ఉంది. కాకపోతే మునుపటిలా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల్ని అప్రమత్తం చేయడం లేదు. నిబంధనలు లేవు. పాటించే ప్రజలూ కనిపించడం లేదు. కరోనా ఆసుపత్రులు మూసేశారు. కోవిడ్ ేఛంద్రాలు చుట్టేశారు. టెస్ట్‌లూ తగ్గించేశారు. నింద ప్రజలమీద వేసి నిమ్మళంగా ఉంటున్నారు. మాస్క్‌లు పెట్టుకోవడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. ఎక్కడ చూసినా గుంపులే! బహుశా ఇది చూసేనేమో..ఎంత హెచ్చరించినా ఈ మనిషి మారడని కరోనా మళ్లీ కన్నెర్రచేస్తోంది. వ్యాప్తి పెరుగుతోంది. సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతోందని అంకెలు భయపెడుతున్నాయి. ప్రభుత్వం మీద భారం వేసి విచ్చలవిడిగా తిరిగితే మాత్రం చేతులు కాలిపోయాక పట్టుకోవడానికి ఆకులు కూడా మిగలవు.
ఒక ఏడాది పీడకల
గత ఏడాది మార్చి 24న చిత్తూరు జిల్లావాసికి తొలి పాజిటివ్ అని తేలింది. లండన్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన యువకుడికి పాజిటివ్ అని తేలడంతో జిల్లా అంతా గడగడలాడిపోయింది. భయపడినట్టుగానే ఏడాదిలో దాదాపుగా లక్షమందిని వైరస్ తాకి ప్రతాపం చూపింది. 866 మంది ప్రాణాలను బలిగొన్నది. గత మార్చి - ఆగస్టు నెలల నడుమ టెస్టులు, పాజిటివ్ కేసులు, మరణాలూ... ఇలా అన్నింటా జిల్లాలో తీవ్రస్థాయిలో పెరుగుదల కనిపించింది. పాజిటివ్ కేసుల సంఖ్యలోనూ, మరణాల సంఖ్యలోనూ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాయే మొదటి స్థానంలో నిలిచింది. సెప్టెంబరు నుంచీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ క్రమేపీ వైరస్ తగ్గుముఖం పడుతూ వచ్చింది.
సకలం విధ్వంసం
ఏడాదిగా కొవిడ్-19 సంక్షోభం జిల్లాను కూడా అతలాకుతలం చేసేసింది. గతేడాది మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలై సుదీర్ఘంగా కొనసాగిన లాక్‌డౌన్ పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపార, రాజకీయ, ఆధ్యాత్మిక, పారిశ్రామిక రంగాలన్నీ కుదుపుకు లోనయ్యాయి. ఆన్‌లైన్ చదువులు పిల్లల్ని గాడ్జెట్‌లకు బానిసల్ని చేసేశాయి . కొన్ని నెలల పాటూ కుదేలైన వైద్య రంగం తిరిగి కోలుకుని మునుపటి జోరు అందుకుంది. హోటళ్లు, లాడ్జీలు, రవాణా రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పరిశ్రమలు మూతబడి, కార్మికులు వలసబాట పట్టడం.. గుడులు.. చర్చిలు.. మసీదులు సైతం నిర్జనంకావడం.. ఎటు చూసినా మరణ భయం వ్యాపించడం.. ఆస్పత్రికి వెళ్లినవారు కన్ను మూస్తే కనీసం ఇంటికి మృతదేహాన్ని తీసుకురాలేకపోవడం.. కరోనా మృత దేహాల ఖననానికి ఊళ్లే అడ్డుకోవడం... ఒక పీడకలలా ఏడాది కాలం గడిచిపోయింది. ఈ పీడకల మళ్లీ మళ్లీ రాకూడదనుకుంటే ప్రజలే అప్రమత్తంగా ఉండాలి.
ఇప్పుడేం జరుగుతోంది...
ప్రపంచమంతా మొదలైన వైరస్ సెకండ్ వేవ్ జిల్లానూ తాకింది. వైరస్ వ్యాప్తి జోరందుకుంటోంది. గత నెలలో 454 మందికి కరోనా వైరస్ సోకగా కేవలం ఇద్దరు మాత్రమే మరణించారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 1002 మందికి వైరస్ సంక్రమించగా 8 మంది చనిపోయారు. అన్‌లాక్ తర్వాత జిల్లాలో విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలూ, హోటళ్ళు, లాడ్జీలు, పార్కులు, సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సు సర్వీసులు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ఆలయాల్లో భక్తుల సంఖ్యా పెరిగింది. శుభాశుభ కార్యక్రమాలకు జనం హాజరు పెరిగింది. స్థానిక ఎన్నికలతో రాజకీయ కార్యకలాపాలూ పెరిగాయి. జన సంచారం మునుపటి స్థితికి చేరింది. తిరుమలకు రోజువారీ యాత్రికుల సంఖ్య 6 వేలతో మొదలై ఇపుడు 50 వేలు దాటింది. జనం మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం, గుంపులకు దూరంగా వుండడం వంటి నిబంధనలేవీ పాటించడం లేదు. హోటళ్ళు, షాపింగ్ మాళ్ళు, కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. మనుషుల మధ్య భౌతిక దూరమన్నదే కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా కొవిడ్-19 నియంత్రణ చర్యలు తగ్గించివేసింది. అనుమానితులు ఎక్కడ టెస్టులు చేయించుకోవాలి, వైరస్ సోకిన వారు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ సలహాలు తీసుకోవాలి, ఎక్కడ వైద్య సేవలు పొందాలి అన్న సమాచారమే బాధితులకు అందుబాటులో లేకుండా పోయింది. ఇళ్ళ వద్ద వున్న బాధితుల ఆరోగ్యం పట్ల పర్యవేక్షణ లేదు. ఒక వేళ వైరస్ సోకి ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నా చేరడానికి ఒక్క ప్రయివేటు ఆసుపత్రి కూడా లేదు. పరీక్షించేందుకు ఒక్క డాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. తిరుపతిలో స్విమ్స్ ఆధ్వర్యంలో నడిచే పద్మావతీ ఆస్పత్రి మినహా మరెక్కడా వైరస్ బాధితులకు వైద్యం అందడం లేదు. వైరస్ వ్యాప్తి ఇంకా పెరిగితే..అనే ఆలోచనే ఆందోళన కలిగిస్తోంది.
-----------------------------------------------------------------------------------------------------------
నెల టెస్టులు పాజిటివ్‌లు శాతం మరణాలు శాతం
------------------------------------------------------------------------------------------------------------------------
2020
మార్చి 110 01 0.91 00 00
ఏప్రిల్ 8492 79 0.93 00 00
మే 23838 206 0.99 02 0.97
జూన్ 45446 1326 2.92 08 0.6
జూలై 101227 10177 10.05 107 1.04
ఆగస్టు 151326 27994 18.5 321 1.15
సెప్టెంబరు 158945 25391 15.97 233 0.92
అక్టోబరు 192946 16019 8.3 122 0.76
నవంబరు 131506 5004 3.81 44 0.88
డిసెంబరు 150823 420 1.6 13 0.54
-----------------------------------------------------------------------------------------------------------
(మొత్తం 961659 88617 9.22 850 0.96)
---------------------------------------------------------
2021
జనవరి 120821 850 0.70 06 0.71
ఫిబ్రవరి 72501 454 0.63 02 0.44
మార్చి 80924 1002 1.24 08 0.80
---------------------------------------------------------------------------------------------------------
గ్రాండ్ టోటల్ 1235905 90923 7.36 866 0.95
----------------------------------------------------------------------------------------------- -