భారీ వర్షాలతో టీటీడీకి రూ.4 కోట్లకుపైగా నష్టం

ABN , First Publish Date - 2021-11-21T07:55:09+05:30 IST

తిరుమల, తిరుపతిలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

భారీ వర్షాలతో టీటీడీకి రూ.4 కోట్లకుపైగా నష్టం

30 ఏళ్లలో ఇంత భారీ వర్షం కురవలేదు

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తాం

చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి


తిరుమల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల, తిరుపతిలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్‌డ్యాములు పొంగి పొర్లి కపిలతీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురిచేశాయని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘తిరుమలలో అయితే దాదాపు రూ.4 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగింది. మొదటి ఘాట్‌లోని అక్కగార్ల ఆలయం వద్ద రక్షణ గోడ దెబ్బతిన్నది. నాలుగు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. టీటీడీ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలగించి, తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. రెండో ఘాట్‌లోని 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఐదుచోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. వీటిని కూడా వేగవంతంగా తొలగించాం. నారాయణగిరి గెస్ట్‌ హౌస్‌ను ఆనుకుని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయి. అధికారులు ఈ కాటేజీతోపాటు పక్కనే ఉన్న ఎస్వీ అతిథి గృహంలోని భక్తులను ముందు జాగ్రత్తగా ఇతర ప్రాంతాలకు తరలించారు. మరోవైపు శ్రీవారిమెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, ఫుట్‌పాత్‌ ధ్వంసమైంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుకభాగంలోని గోడతోపాటు, రామ్‌నగర్‌, వినాయకనగర్‌, జీఎంబీ క్వార్టర్స్‌, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్‌ వాల్స్‌ దెబ్బతిన్నాయి. కపిలతీర్థం ఆలయంలోని ఓ మండపం దెబ్బతినడంతో మరమ్మతులకు రూ.70లక్షలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అలాగే వర్షం కారణంగా టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం ఏర్పడగా, ఐటీ విభాగం అప్రమత్తమై వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం వచ్చి తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు, మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశాం. టికెట్లు ఉండి దర్శనానికి రాలేకపోయిన భక్తులను వర్షం తగ్గాక స్వామి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించాం. తిరుమలలోపాటు తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. 

Updated Date - 2021-11-21T07:55:09+05:30 IST