నిఘా నీడలో కౌంటింగ్‌

ABN , First Publish Date - 2021-03-14T07:14:13+05:30 IST

మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేపట్టామని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు.

నిఘా నీడలో కౌంటింగ్‌
ఎస్పీ సెంథిల్‌కుమార్‌

విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా పేల్చడంపై నిషేధం

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు  ఫ ఎస్పీ సెంథిల్‌కుమార్‌


చిత్తూరు, మార్చి 13: మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల  భద్రతా ఏర్పాట్లను చేపట్టామని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1068 మంది పోలీసులతో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 46 మంది ఎస్‌ఐలు, 600 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 150 మంది స్పెషల్‌ పార్టీ సిబ్బంది, 150మంది ఏఆర్‌ సిబ్బందితో పాటు వందమంది హోంగార్డులను నియమించామన్నారు. సీసీ కెమెరాలు, బాడీ ఓన్‌ కెమెరాలు, పాల్కాన్‌ వాహనాలతో కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 30 పోలీస్‌ యాక్ట్‌, 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్‌ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. సభలు, సమావేశాలను నిషేధించినట్లు పేర్కొంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, కవ్వింపు చర్యలకు పాల్పడకూడదని సూచించారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా చేరి మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫలితాలు వెలువడ్డాక కూడా విజయోత్సవాలు నిర్వహించడం, డప్పులు వాయించడం, బాణాసంచా పేల్చడంపై నిషేధం వుంటుందన్నారు.కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థుల, ఏజెంట్ల వాహనాలను పార్కింగ్‌ స్థలాల్లో మాత్రమే వుంచి ట్రాఫిక్‌కు సహకరించాలన్నారు. 

Updated Date - 2021-03-14T07:14:13+05:30 IST