1న పింఛన్ల పంపిణీలో గందరగోళం!

ABN , First Publish Date - 2021-12-30T07:30:04+05:30 IST

పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొత్త ఏడాది ప్రారంభంలో జిల్లావ్యాప్తంగా గందరగోళానికి దారి తీసే పరిస్థితులు నెలకొన్నాయి.

1న పింఛన్ల పంపిణీలో గందరగోళం!

ప్రతి మండలంలో ఐదు రోజులు పంపిణీ చేయాలని ఆదేశాలు


కలికిరి, డిసెంబరు 29: రెండేళ్ళుగా ప్రతి నెలా ఒకటవ తేదీన జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొత్త ఏడాది ప్రారంభంలో జిల్లావ్యాప్తంగా గందరగోళానికి దారి తీసే పరిస్థితులు నెలకొన్నాయి. పెంచిన మొత్తం రూ.250 అదనంగా చేర్చి శనివారం రూ.2500 వంతున పంపిణీ చేయాల్సి వుంది. అయితే చాలా రోజుల తరువాత పింఛను మొత్తాన్ని పెంచిన కారణంగా దీనికి ప్రాచుర్యం లభించాలనే యోచనతో అన్ని చోట్లా ఒకే రోజు కాకుండా ఐదు రోజులపాటు పంపిణీ చేపట్టాలని జిల్లాస్థాయి నుంచి మండలాలకు మౌఖిక ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది.మండల స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ లాంటి ప్రజా ప్రతినిధులతో పింఛన్లు పంపిణీ చేయించాలని ఆ మేరకు ఐదు రోజుల్లో ఎక్కడెక్కడ పింఛన్ల పంపిణీ జరిగాలన్న దానిపై కార్యాచరణ రూపొందించుకోవలసిందిగా ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. ఒక పంచాయతీలో 1వ తేదీ పంపిణీ చేసి మరి కొన్ని చోట్ల నాలుగయిదు రోజుల తరువాత పంపిణీ చేస్తే పింఛనుదారుల్లో గగ్గోలు మొదలవుతుందనే అనుమానంతో ఐదు రోజులకు సరిపడా కార్యాచరణ ఎలా రూపొందించుకోవాలో పాలుపోక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దానికి తోడు పెంచిన పింఛన్లు కాబట్టి లబ్ధిదారుల్లో ఆసక్తి పెరుగుతుందని అనుమానిస్తున్నారు. అంతేగాకుండా ఆరు నెలలుగా పెండింగులో వున్న వాటికి మోక్షం లభించి జనవరి నుంచి ప్రతి పంచాయతీకి కొత్త పింఛన్లు కూడా మంజూరయ్యాయి. వీటి పంపిణీని కూడా చేపట్టాల్సి వుంది. అంతేగాకుండా నాలుగు నెలల క్రితం వివిధ కారణాలతో వేల కొద్ది పింఛన్లు రద్దయ్యాయి. వాటిలో కొన్నింటిని పునరుద్ధరించారు. దీంతో కొత్త పింఛనుదారుల్లోని ఆతృతను ఐదు రోజులపాటు ఎలా నిలువరించాలన్న దానిపై కూడా అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఇక గతంలో మూడు నెలలకోసారి పింఛను తీసుకున్నా ఇబ్బంది లేదు. కానీ ప్రస్తుతం ఏ నెలకు ఆ నెల పింఛను తీసుకోకపోతే రద్దవుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణా వంటి బయట రాష్ట్రాల్లో వున్న చాలామంది మొదటి తేదీన స్వస్థలానికి వచ్చి పింఛను తీసుకుని వెళ్ళిపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇప్పుడు పింఛను కోసం ఐదు రోజులు ఆగమంటే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్థానిక పరిస్థితులను బట్టి ఐదు రోజులు పింఛన్ల పంపిణీ వుండేటట్లు చూసుకోవాలని వలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి సూచనలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆదేశాలన్నీ  మౌఖికమే కావడంతో ఆ నిర్ణయమేదో అధికారులే తీసుకోవాలని వీరు వెనకడుగేస్తున్నట్లు చెపుతున్నారు. దీంతో పింఛను పెరిగిన పాత పింఛనుదారులకు యథాతథంగా 1వ తేదీన పంపిణీ చేసి, పునరుద్ధరణ చేసిన, కొత్తగా మంజూరయిన పింఛనుదారులకు మాత్రం ప్రజా ప్రతినిధుల చేత పంపిణీ చేయిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. 


నేటి నుంచి పింఛనుదారులతో వలంటీర్ల ‘సెల్ఫీలు’

 గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు తమ పరిధిలోని పింఛనుదార్లతో వలంటీర్లు సెల్ఫీలు దిగాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.రూ.250 వంతున పింఛను పెరిగిందని  వివరించి వారితో సెల్ఫీలు తీసుకోవాలని ఈ వుత్తర్వులో పేర్కొన్నారు. జనవరి 1న సీఎం జగన్మోహన్‌ రెడ్డి ‘పెంచిన పింఛను’ ప్రారంభించిన అనంతరం క్షేత్రస్థాయిలో వలంటీర్లు పంపిణీ చేపట్టాలని ఇందులో సూచించారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.  

Updated Date - 2021-12-30T07:30:04+05:30 IST