ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

ABN , First Publish Date - 2021-08-10T05:53:58+05:30 IST

స్పందన కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలు సంఘాల నేతలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ధర్నాలు నిర్వహించారు.

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌
ధర్నా చేస్తున్న డప్పు కళాకారులు

‘స్పందన’కు 337 వినతులు


చిత్తూరు, ఆగస్టు 9: స్పందన కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం పలు సంఘాల నేతలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ హరినారాయణన్‌కు, అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. 337 మంది బాధితులు వినతిపత్రాలను సమర్పించారని కలెక్టర్‌ తెలిపారు. వీటిలో.. రెవెన్యూశాఖకు 216, డీఆర్‌డీఏకు 59, గృహ నిర్మాణశాఖకు 13, పౌరసరఫరాలశాఖకు 9, మున్సిపాలిటీలకు 6, పోలీస్‌శాఖకు 5, ఇతర శాఖలకు 29 అర్జీలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు రాజాబాబు, వీరబ్రహ్మం, రాజశేఖర్‌, డీఆర్వో మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

యానాదులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని యానాది సంఘ జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య, రాష్ట్ర అధ్యక్షురాలు సావిత్రమ్మ విమర్శించారు. కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో వారు ప్రసంగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా.. యానాదులకు చేసిందేమీ లేదన్నారు. నేతలు భాస్కరయ్య, మనీలమ్మ, సావిత్రమ్మ,  జయరామయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బాబు ఆరోపించారు. కలెక్టరేట్‌ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క రుణం కూడా ఇవ్వలేదన్నారు.

తమ సమస్యలు పరిష్కరించాలంటూ డప్పు కళాకారులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ.. అర్హులైన కళాకారులకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో కూడిన పెన్షన్‌ను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కళాకారులకు గుర్తింపుకార్డులతోపాటు డప్పులు, దుస్తులు, గజ్జెలను పంపిణీ చేయాలన్నారు. కరోనా భృతికింద రూ.7500, 20 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను ఇవ్వాలన్నారు. డప్పు కళాకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లె సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్‌, సురేంద్రన్‌, తదితరులు పాల్గొన్నారు.

నూతన విద్యావిధానాన్ని ఉపసంహరించుకోవాలని ఐఎఫ్‌టీయూ జిల్లా  గౌరవాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ డిమాండ్‌ చేశారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ఫెడరేషన్‌ (ఐఎఫ్‌టీయూ) పిలుపుతో కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. పదేళ్లు సర్వీస్‌ ఉన్న వారికి  నేరుగా గ్రేడ్‌-2సూపర్‌వైజర్‌ పోస్టును ఇవ్వాలన్నారు. సంఘ జిల్లా అధ్యక్షురాలు భారతి, కార్యదర్శి ప్రియదర్శిని, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేతలు కోరారు. ఈ మేరకు జేసీ వీరబ్రహ్మంకు చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, తెలుగు యువత అధ్యక్షుడు కాజూరు రాజేష్‌, కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌ తదితరులు వినతిపత్రం అందించారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పనులు పూర్తయిన వారికి బిల్లులను మంజూరు చేయాలని కోరారు.


అనుమతి లేకుండా ధర్నా చేసిన వారిపై కేసు 

కొవిడ్‌ నిబంధనలు పాటించక పోవడంతోపాటు ముందస్తు అనుమతి తీసుకోకుండా సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసిన పలువురిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో.. డప్పు కళాకారుల సంఘ నేతలు సురేంద్ర, వెంకటయ్య, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నేతలు హరికృష్ణ, భారతి, ఎస్సీ మోర్చా నేత బాబు తదితరులున్నారు. 

Updated Date - 2021-08-10T05:53:58+05:30 IST