ఆర్టీసీ అద్దె దుకాణాల మూత
ABN , First Publish Date - 2021-07-24T05:45:26+05:30 IST
ఆర్టీసీ బస్టాండుకు ఉత్తరం వైపున అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆర్టీసీ స్థలంలో ఐదు దుకాణాలు ఉన్నాయి. మదనపల్లె ఆర్టీసీ డిపోకు అనుబంధంగా ఉన్న ఐదు దుకాణాలను శుక్రవారం అధికారులు మూసివేయించారు.

బకాయిలు చెల్లించకుంటే రద్దు
టూ డిపో డీఎం
మదనపల్లె టౌన్, జూలై 23: మదనపల్లె ఆర్టీసీ డిపోకు అనుబంధంగా ఉన్న ఐదు దుకాణాలను శుక్రవారం అధికారులు మూసివేయించారు. ఆర్టీసీ బస్టాండుకు ఉత్తరం వైపున అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆర్టీసీ స్థలంలో ఐదు దుకాణాలు ఉన్నాయి. వీటిని అద్దెకు తీసుకుని బేకరి, చాట్‌సెంటర్, టీ దుకాణాలు పెట్టుకుని ఐదుగురు జీవనం సాగిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంతో గత ఏడాది అద్దె చెల్లించలేక పోయారు. ఈ యేడాది మార్చి నుంచి కరోనా లాక్‌డౌన్లు, అర్ధ రోజు కర్ఫ్యూ కారణంగా దుకాణాలు తెరుచుకోక వ్యాపారాలు సన్నగిల్లాయి. ఈ కారణంగా దుకాణాల నిర్వాహకులు ఐదు నెలలుగా ఆర్టీసీకి అద్దె బకాయిలు పడ్డారు. ఈ క్రమంలో టు డిపో మేనేజర్ మురళీకృష్ణ ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా వీరు అద్దె చెల్లించకపోవడంతో శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య వాటిని మూసివేయించారు. దీనిపై మురళీకృష్ణ మాట్లాడుతూ ఐదు దుకాణాలకు కలిపి ఇప్పటికి రూ.3.30లక్షలు అద్దె బకాయిలు పడ్డారని, నోటీసులు ఇచ్చినా స్పందించ లేదన్నారు. అద్దె చెల్లించకపోతే దుకాణాలను రద్దు చేస్తామన్నారు. కాగా ఉన్నట్టుండి దుకాణాలను మూసివేయించడంతో తాము వీధిన పడ్డామని ఐదు దుకాణాల నిర్వాహకులు వాపోయారు.