తెలుగునేలపై క్రైస్తవం తొలిజాడలు

ABN , First Publish Date - 2021-12-25T05:46:17+05:30 IST

తెలుగునేల మీదకు క్రైస్తవం అడుగుపెట్టి ఇప్పటికి 320 ఏళ్ళు అయ్యింది.

తెలుగునేలపై క్రైస్తవం తొలిజాడలు
మార్లపల్లెలో వెంకటమ్మ నిర్మించిన పురాతన చర్చి

గిన్నిస్‌ బుక్‌లో మార్లపల్లెకు చోటు


పుంగనూరు:

 తెలుగునేల మీదకు క్రైస్తవం అడుగుపెట్టి ఇప్పటికి 320 ఏళ్ళు అయ్యింది. ఆ స్థానం చిత్తూరుజిల్లాకే దక్కింది. గిన్నిస్‌బుక్‌లోనూ నమోదైన ఈ విశేషానికి కేంద్రం పుంగనూరు సమీపంలోని మార్లపల్లె. 


1701లో పుంగనూరు బజారువీధిలో క్రైస్తవ మత బోధనలు జరిగాయి. వీటికి ప్రభావితం అయిన  మార్లపల్లెకు చెందిన వెంకటమ్మ తన నలుగురు కుమారులతో తొలిసారిగా బాప్టిజాన్ని స్వీకరించింది. ఆ తర్వాత క్రైస్తవమతవ్యాప్తి మొదలైంది. పుంగనూరు పాలకుల సహాయంతో మార్లపల్లెలో ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని కూడా వెంకటమ్మ నిర్మించింది. అది శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 1935లో పక్కనే మేరీమాత చర్చి నిర్మించారు. మార్లపల్లెలో 1780లోనే రోమన్‌ క్యాథలిక్‌ చర్చి నిర్మించినట్లు ప్రముఖ చరిత్రకారుడు శేషన్‌ తన ఆంగ్ల రచనలో పేర్కొన్నారు. పుంగనూరు జమీందారుల పాలనలో పుంగనూరు ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.  108 దివ్య క్షేత్రాలతో చారిత్రక హిందూ దేవాలయాలకు, క్రైస్తవ ప్రార్థనామందిరాలకు, ముస్లీంల మసీదులకు ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. బ్రిటిష్‌ పాలకుడు స్కడ్డర్‌ మదనపల్లె నుంచి వేలూరు వెళుతుండగా మార్గమధ్యంలోని పుంగనూరును సందర్శించాలంటూ ఆనాటి జమిందారు రాజా సుగుటూరి ఇమ్మడి శంకర్‌రాయల్‌ యశోవంత బహదూర్‌ ఆహ్వానించారు. ఇక్కడ ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థించారు. ఇక క్రైస్తవులు ప్రార్థనలు చేసుకునేందుకు జమీందారుల సహకారంతో పుంగనూరు నడిబొడ్డున స్థానిక సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం పక్కన 1887లో సీఎస్‌ఐ చర్చి నిర్మించారు. అలాగే 1889లో ప్రస్తుత బసవరాజ పాఠశాలలో ఉన్నత విద్య ప్రారంభించినా, అంతకు మునుపే స్కడ్డర్‌ 1860లో మిషనరీస్‌ సర్వీసులు ప్రారంభించారు. రెవరెండ్‌ స్కడ్డర్‌, ఆయన సతీమణి 1930లో సీఎస్‌ఐ చర్చి పునర్నిర్మాణం మొదలుపెట్టి 1932లో పూర్తి చేశారు. డాక్టర్‌ మాన్షియస్‌ హట్టన్‌దొర జ్ఞాపకార్థంగా చర్చి పునర్నిర్మాణ పనులకు రిఫార్స్‌డ్‌ చర్చి న్యూబ్రౌన్సివిక్‌ వారు 3500డాలర్లను విరాళంగా పంపారు. ఇందువల్లే సీఎస్‌ఐ చర్చికి హట్టన్‌ మెమోరియల్‌ చర్చిగా నామకరణం చేశారు. అలాగే పుంగనూరు ఇందిరాసర్కిల్‌ సమీపంలో మేరీమాత చర్చిని నిర్మించారు. 





Updated Date - 2021-12-25T05:46:17+05:30 IST