ఓ మహిళ ద్వారా యువతి పరిచయం.. ప్రేమ.. గర్భవతి అని తెలియడంతో రెండ్రోజుల క్రితం...!

ABN , First Publish Date - 2021-07-24T06:16:07+05:30 IST

ఆ యువకుడికి వరసకు అక్క అయిన ఓ మహిళ ద్వారా ఈ యువతి పరిచయమైంది...

ఓ మహిళ ద్వారా యువతి పరిచయం.. ప్రేమ.. గర్భవతి అని తెలియడంతో రెండ్రోజుల క్రితం...!

శ్రీకాళహస్తి అర్బన్‌, జూలై 23: ఓ యువకుడి మాయమాటలతో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని మోసపోయి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంది. బాధితురాలి తండ్రి కథనం మేరకు ....బీఎన్‌కండ్రిగ మండలానికి చెందిన ఓ జంట బాతుల పెంపకంతో జీవనం సాగిస్తోంది. వీరికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. బాతుల పెంపకం కోసం తల్లిదండ్రులు ఇంటికి దూరంగా ఉంటారు. కొడుకు తిరుపతిలో చదివేవాడు. శ్రీకాళహస్తిలో ఆ యువతి ఇంటర్‌ చదువుతూ హాస్టల్లో వుండేది. పక్క గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఆ యువకుడికి వరసకు అక్క అయిన ఓ మహిళ ద్వారా ఈ యువతి పరిచయమైంది. తరచూ  వచ్చి మాట్లాడేవాడు.


ఇంటర్‌ పూర్తయి ఇంటికి చేరిన తరువాత కూడా ఆ యువతి కోసం తరచూ వస్తుండడం గమనించిన చుట్టుపక్కలవారు ఆరు నెలల క్రితం ఆ యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుమార్తెను తమ వెంట తీసుకుని వారు విజయవాడకు వెళ్లిపోయారు. పది రోజుల క్రితం బాతులు అమ్మేయడంతో అందరూ స్వగ్రామానికి చేరుకున్నారు. అప్పటికే తాను గర్భవతి అయినట్లు తెలిసి ఆ యువతి ప్రేమికుడికి సమాచారం ఇచ్చింది. అబార్షన్‌ చేసుకుంటే సమస్య సమసిపోతుందంటూ ఆ యువకుడు తన సోదరి వరసయ్యే మహిళను ఆమె దగ్గరకు పంపించి నమ్మించాడు. రెండు రోజుల క్రితం ఆమె సలహాతో రెండు మాత్రలు వేసుకున్న ఆ యువతి బుధవారం రాత్రి తట్టుకోలేనంత తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావంతో అల్లాడిపోయింది. తల్లిదండ్రులు ఆరా తీయడంతో జరిగిన విషయాన్ని వివరించింది. గురువారం ఉదయం చికిత్స నిమిత్తం ఆటోలో యువతిని శ్రీకాళహస్తికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలోనే మృతశిశువు అబార్షన్‌ ద్వారా బయటపడింది. ఆ యువతి  అస్వస్థతకు గురికావడంతో ఓ ప్రైవేటు వైద్యశాలలో ప్రాథమిక వైద్యం అందించారు.శుక్రవారం మళ్లీ అస్వస్థతకు గురికావడంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు.చివరకు బాధితురాలు శుక్రవారం బీఎన్‌ కండ్రిగ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2021-07-24T06:16:07+05:30 IST