అదుపుతప్పి కారు బోల్తా

ABN , First Publish Date - 2021-07-12T05:31:40+05:30 IST

పలమనేరు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అదుపుతప్పి కారు బోల్తా
పలమనేరు సమీపంలో బోల్తా పడిన కారు

డ్రైవర్‌ మృతి, నలుగురికి తీవ్రగాయాలు 

పెళ్లిచూపులకు వెళ్తుండగా ప్రమాదం


పలమనేరు, జూలై11 : పలమనేరు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు తగలని కారులోనే ప్రయాణిస్తూ వచ్చిన నరసింహ కథనం మేరకు... ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు(61) తన కుమారుడు సాయిరాం పెళ్లిచూపుల కోసం బెంగళూరుకు శనివారం రాత్రి బయలు దేరారు. వెంకటేశ్వర్లుతోపాటు ఆయన సతీమణి వెంకటరమణమ్మ(56), కుమార్తె కుసుమకుమారి(33), అల్లుడు నరసింహ(35) కూడా కారులో బయలుదేరారు.  ఆదివారం ఉదయం సుమారు 4.45 గంటల ప్రాంతంలో పలమనేరు మరికొంత దూరం ఉందనగానే కారు డ్రైవర్‌ భరత్‌కుమార్‌(32) కారు నిలిపి మొహం కడుక్కొని మళ్లీ బయలుదేరాడు. కారు సరిగ్గా పట్టణ సమీపంలోని చరణ్‌ హాటల్‌ సమీపంలోని ఫ్లై ఓవర్‌ దిగగానే డ్రైవర్‌ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో కారు డివైడర్‌ను ఢీకొని అవతలివైపున సుమారు 60 అడుగుల దూరంలో బోల్తాపడింది. పెట్రోల్‌ బంకు సమీపంలో వున్నవారు గుర్తించి 108కు సమాచారం అందించారు. తొలుత డ్రైవర్‌ భరత్‌కుమార్‌, కుసుమకుమారి, సాయిరాంలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మళ్లీ వెళ్లి వెంకటేశ్వర్లు, వెంకటరమణమ్మ దంపతులతోపాటు నరసింహలను ఆస్పత్రికి తరలించారు. భరత్‌కుమార్‌ చికిత్సపొందుతూ తుది శ్వాసవిడిచారు. వీరిలో నరసింహ మాత్రం ఎటువంటి గాయాలు తగలకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మిగిలి ముగ్గురి పరిస్థితి కూడా ఆందోళనకరంగా వున్నందున చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Updated Date - 2021-07-12T05:31:40+05:30 IST