మేము చచ్చాక ఇంటి స్థలాలిస్తారా?

ABN , First Publish Date - 2021-07-12T06:39:17+05:30 IST

‘ఎన్ని సంఘాల్లో చేరాలి. మేము చచ్చాక ఇంటి స్థలం ఇస్తారా?’ అని టీటీడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేము చచ్చాక ఇంటి స్థలాలిస్తారా?
వాదులాడుకుంటున్న టీటీడీ ఉద్యోగులు

టీటీడీ ఉద్యోగుల ఆగ్రహం

రసాభాసగా హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ సమావేశం


తిరుపతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్ని సంఘాల్లో చేరాలి. మేము చచ్చాక ఇంటి స్థలం ఇస్తారా?’ అని టీటీడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎంప్లాయీస్‌ క్యాంటీన్‌ ప్రాంగణంలో జరిగిన టీటీడీ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ సమావేశం రసాభాసగా మారింది. ప్రస్తుత సొసైటీలో రిజిస్టర్‌ అయితేనే భవిష్యత్తులో ఎవరికైనా ఇంటి స్థలాలు వస్తాయి అని కొందరు.. ఇప్పటికే రిజిస్టర్‌ అయినవారు, టీటీడీకి రూ.250 చెల్లించిన వారు ఎలాంటి సొసైటీలో చేరాల్సిన అవసరం లేదని మరికొందరు.. ఇలా వర్గాలుగా మారడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. కాగా.. పూర్‌ హోమ్‌, డెయిరీ ఫామ్‌, బ్రాహ్మణపట్టు, వినాయక నగర్‌, ఎస్జీఎస్‌ అపార్ట్‌మెంట్ల వద్ద 2008లో అర్హత పొందిన వారి విషయం సుప్రీం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఏర్పాటైన ఏడుగురు అధికారుల కమిటీతో ఇటీవల టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఒకవేళ కోర్టులో కేసు నెగిటివ్‌ అయితే వడమాలపేట వద్ద టీటీడీ ఇచ్చే స్థలాల్లో వీరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉద్యోగ సంఘ నేతలు కోరారు. ఈ క్రమంలో తాము ఎలాంటి సొసైటీల్లో చేరమని, సీనియారిటీ లిస్టు ప్రకారం స్థలాలు కేటాయించాలని కోరారు. దానికి ఈవో కూడా సానుకూలమైన హామీ ఇచ్చినట్టు తమ సభ్యులకు తెలిపారు. అయితే ఆదివారం జరిగిన హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ సమావేశంలో మాత్రం ఉద్యోగులందరూ ఈనెల 20వ తేదీలోపు ప్రస్తుత సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. లేదంటే టీటీడీ బోర్డు రూ.67 కోట్లు ఉద్యోగుల తరఫున ముందుగా చెల్లించి.. వడమాలపేట వద్ద అందిస్తున్న భూమిలో ఇంటి స్థలాలు రావని చెప్పారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఇప్పటికే టీటీడీ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ పేరుతో చాలా సంఘాలు పుట్టుకొచ్చాయని, వేలాది రూపాయలు వసూలుచేసిన వారు డీఏ (క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన) కేసులు ఎదుర్కొంటున్నారని వాదనకు దిగారు. అదీగాక ఇప్పుడున్న సొసైటీలో టీటీడీకి చెందిన అందరు నేతలు లేరు. పైగా ఈ సొసైటీని టీటీడీ గుర్తించిందా? వీరు చెప్పినట్టు రిటైర్డ్‌ ఉద్యోగులు మొదలు అందరూ తప్పకుండా రిజిస్టర్‌ చేసుకోవాలా? అనే అంశంపై టీటీడీ ఉన్నతాధికారులు కూడా స్పష్టత ఇవ్వక పోవడంపై మండిపడ్డారు. వెంటనే టీటీడీ ఈవో ఈ విషయంలో ఉద్యోగులకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆలోపు 20వ తేదీ చివరి తేదీగా ప్రకటించటానికి వీల్లేదన్నారు. ఈ సమావేశంలో హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ నేతలు వెంకటరమణారెడ్డి, గోల్కొండ వెంకటేశం, నాగార్జున, మేడికొండ ప్రసాదరావు, ఇందిర, సుబ్రమణ్యం రెడ్డి, చంద్రశేఖర్‌, నారాయణప్ప, సంజీవి, మహీధర్‌ రెడ్డి, రవీంద్రరెడ్డి, రామచంద్ర, భాస్కర్‌, కల్పన, గుణశేఖర్‌, రేణుదీక్షిత్‌, నాగరత్నం, వెంకటరమణ, శేఖర్‌, రెడ్డెప్ప, మునివెంకటరెడ్డి, త్యాగరాజు, మధుసూదన్‌, రామకృష్ణ, తిమ్మప్ప, పద్మలత, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.రూ.67 కోట్లు పెట్టి అడవిలో భూమి కొనాలా?

వడమాలపేట వద్ద అడవిలో టీటీడీ రూ.67 కోట్లను పెట్టి మూడువందల ఎకరాలు కొనాలా? అంటే ఎకరా రూ.22 లక్షలు అవుతోంది. అంతకంటే తక్కువ ధరకు తిరుపతికి దగ్గరలోనే రైతుల నుంచి కొనవచ్చు.  ప్రభుత్వానికి దేవుడి డబ్బులు కట్టబెట్టే పనిగా ఉందనిపిస్తోంది. తిరుపతి సమీపంలోనే అదే డబ్బు పెట్టి కొనివ్వాలని కోరుతున్నాం.

- శ్రీనివాసులు టీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగిసీనియర్లను ఇబ్బంది పెట్టొద్దు

ఇప్పటికే పాతవారికి సీనియారిటీ ఫిక్స్‌ అయ్యింది. అవసరమైన డాక్యుమెంట్స్‌ అప్పట్లోనే టీటీడీకి ఇచ్చారు. టీటీడీ కూడా అధికారికంగా గుర్తించింది. అలాంటి సీనియర్లను ఇప్పుడున్న నేతల వద్దకు వచ్చి.. మళ్లీ అప్లికేషన్స్‌ ఇవ్వమని అడగటం అవమానించటం అవుతుంది. వారితో గౌరవప్రదంగా వ్యవహరించటం ఉత్తమం. లేదంటే వివాదాలు పెరుగుతాయి. లబ్ధిదారులూ నష్టపోతారు. 

- ఆనందరావు, టీటీడీ ఉద్యోగిటీటీడీ భూములు ఎవరెవరికో ఇచ్చేశారు

తిరుపతిలో ఎస్వీయూకు వందల ఎకరాలు టీటీడీ 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. మహిళా వర్సిటీకి ఇచ్చింది. భారతీయ విద్యాభవన్‌కూ, జూ పార్కుకు,  టూరిజం వారికి ఇచ్చింది. ఇలా వేలాది ఎకరాలు ఎవరెవరికో ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగులకోసం ప్రభుత్వం వద్ద కొనాల్సి వస్తోంది.

- మలిశెట్టి రమేశ్‌ బాబు, రిటైర్డ్‌ ఉద్యోగి 

Updated Date - 2021-07-12T06:39:17+05:30 IST