ఉప ఎన్నిక ముందు బీజేపీకి జనసేన టెన్షన్.. పవన్ ఏం చేస్తారో..!?

ABN , First Publish Date - 2021-03-21T20:51:53+05:30 IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో

ఉప ఎన్నిక ముందు బీజేపీకి జనసేన టెన్షన్.. పవన్ ఏం చేస్తారో..!?

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, సీపీఎం తదితర పార్టీలు వేగంగా స్పందించగా బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపికపై కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. టీడీపీ, వైసీపీ, సీపీఎం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి సంగతి తెలియకపోయినా మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ ఇప్పటికే ప్రచారం ప్రారంభించేశారు. దీనికి భిన్నంగా కేంద్రంలో పాలక పార్టీ అయిన బీజేపీ ఇంకా అభ్యర్థి ఎంపికపై కసరత్తులోనే మునిగితేలుతోంది. ఎందుకు? ఏ భయం బీజేపీని అలా వెనక్కు నెడుతోంది? ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలు కమలం పార్టీకి ఉన్నాయా? వివరాలు ఏబీఎన్-ఇన్‌సైడ్‌లో చూద్దాం.


బీజేపీ నేతల అంచనా ఏంటి..!?

ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా నెల రోజులు కూడా లేదు. అయినా ఇంకా నాలుగు రోజుల తర్వాతే బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అభ్యర్థిని ప్రకటించిన వెంటనే బీజేపీ ప్రచార రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందనీ, ప్రధానంగా ఆ వ్యతిరేకతే తమకు అనుకూలంగా మారుతుందనీ తిరుపతి నియోజకవర్గ బీజేపీ నేతలు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వ్యవహరించిన రీతిలో వైసీపీ వర్గాలు ఉపఎన్నికల్లో దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులకు పాల్పడే అవకాశాలు ఉండవన్నది బీజేపీ నేతల అంచనా. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం అధికారాల గురించి తెలిసినందున.. వైసీపీ వర్గాలు అటువంటి ప్రయత్నాలకు పాల్పడవనీ, దాంతో ప్రజాభిప్రాయం ఎన్నికల్లో స్పష్టంగా తేటతెల్లమవుతుందనీ, అది తమకు అనుకూలంగా ఉంటుందనీ వారు అంచనా వేస్తున్నారు.


బీజేపీ, జనసేన శ్రేణుల నడుమ అగాధం!

బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ప్రస్తుతానికి చాలా నిర్లిప్తంగా వున్నాయి. తిరుపతి ఉపఎన్నికలు అనివార్యమని తెలిసినప్పటి నుంచే ఇక్కడ తమ అభ్యర్థే పోటీ చేయాలని జనసేన పార్టీ నేతలు అధినేతను డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అలాగైతేనే పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఎన్నికల్లో పనిచేస్తాయని చెబుతూ వచ్చారు. తొలుత పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా అలాగే భావించారు. తిరుపతికి వచ్చి పార్టీ నేతల అభిప్రాయాలు కూడా సేకరించారు. అయితే తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన అభ్యర్థనతో ఆయన ఉమ్మడి అభ్యర్థిని తమ పార్టీ నుంచే పోటీ పెట్టాలన్న అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అప్పటికే బీజేపీ, జనసేన శ్రేణుల నడుమ స్పష్టమైన అగాధం ఏర్పడిపోయింది.


అనుమానమే..!

బీజేపీ ముఖ్యనేతల ఏకపక్ష ప్రకటనలే దీనికి కారణమయ్యాయి. ఉమ్మడి అభ్యర్థి గెలుపుకోసం పనిచేయాలని పవన్‌ కల్యాణ్‌ ఎంత పిలుపు ఇచ్చినా పూర్తి స్థాయిలో జనసేన శ్రేణులు పనిచేయడం ప్రస్తుతానికి అనుమానంగానే కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాక, అభ్యర్థి తీరుపైనే తమ పనితీరు ఆధారపడి ఉంటుందని స్థానిక జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ నేతలే జనసేన నాయకులకు, కార్యకర్తలకు విలువిచ్చి, వారితో పనిచేయించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెబుతున్నారు.


పవన్ ప్రచారానికి వస్తారా..!?

జనసేన కిందస్థాయి కార్యకర్తల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారా? ఆయన ఏం చేయబోతున్నారు? ఈ విషయంపై ఇప్పుడు అటు బీజేపీ నేతల్లోనూ, ఇటు జనసేన శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. వీలైనంతవరకు మనసులో దాచుకోకుండా స్పష్టంచేసే పవన్ కల్యాణ్.. ఇటీవల తిరుపతిలో మీడియాతో చెప్పిన ఒక విషయం ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్‌పై ఒంటికాలితో బీజేపీ లేచింది. తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఇలా అన్ని చోట్ల ఉన్న తెలుగువాందరూ కూడా బల్దియా ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టేలా కమలం పార్టీ హడలెత్తించింది. పవన్ కల్యాణ్‌ కూడా ఈ విషయాన్నే క్యాచ్ చేశారట. "జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, అంతేస్థాయిలో తిరుపతి ఉప ఎన్నికలను తీసుకోవాలి'' అని ఆయన తిరుపతిలో మీడియాతో చెప్పడం గమనార్హం.


పవన్ పెట్టిన షరతేంటి..!?

జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలోనే తిరుపతి ఉపఎన్నికలను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ పార్టీ కేంద్ర పెద్దలతో ప్రచారం చేయించాలన్నది పవన్‌కల్యాణ్‌ పెట్టిన ప్రధాన షరతుగా తెలుస్తోంది. అయితే ఈ షరతు బీజేపీని ఆలోచనలో పడేసిందట. అసలు ఉపఎన్నికల్లో మిత్రపక్షం జనసేన సహకరిస్తుందా? లేదా? అనే అనుమానం కమలనాథుల మదిని తొలుస్తోందట. పవన్‌కల్యాణ్‌ చెప్పింది మామూలు మాట కాదనీ, చాలా లోతైన మాటనీ, భవిష్యత్తును తేల్చే మాటనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ.. అటు జగన్‌తో, ఇటు పవన్‌తో సఖ్యతగా ఉంటోంది. వీలైనప్పుడు చాపకింద నీరులా జగన్‌కు మేలు చేస్తోందని రాజకీయ పరిశీలకుల్లోనే కాకుండా సామాన్యుల్లో సైతం వాదనలు వినిపిస్తున్నాయి.


బీజేపీ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో..!

మొత్తంమీద జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే తిరుపతి ఉపఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీ పెద్దలు ప్రచారం చేయాలన్న జనసేనాని షరతు కమలనాథులను కంగారు పెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇక్కడి బీజేపీ నేతల్లో స్తబ్ధత నెలకొందట. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ కూడా ముందు చేసినంత హడావుడి ప్రస్తుతం చేయకుండా ఉండటం పలు రకాల చర్చకు దారితీస్తోంది. ఉపఎన్నికల్లో బీజేపీకి జనసేన సహకరించడం అనుమానమే అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సందేహాలను నివృత్తి చేసేలా బీజేపీ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.Updated Date - 2021-03-21T20:51:53+05:30 IST