శ్రీవాణి ట్రస్టు దాతలకు ప్రసాదంగా అరటిపండ్లు

ABN , First Publish Date - 2021-09-03T06:47:08+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే శ్రీవాణి ట్రస్టు దాతలకు ఓ అరటి పండును ప్రసాదంగా ఇచ్చేందుకు టీటీడీ ప్రణాళిక రూపొందించుకుంటోంది.

శ్రీవాణి ట్రస్టు దాతలకు ప్రసాదంగా అరటిపండ్లు

తిరుమల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే శ్రీవాణి ట్రస్టు దాతలకు ఓ అరటి పండును ప్రసాదంగా ఇచ్చేందుకు టీటీడీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణం,వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం టీటీడీ 2019 మే నెల్లో శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ట్రస్టుకు రూ.10 వేలకుపైగా విరాళాలు ఇచ్చే దాతలకు ఓ వీఐపీ బ్రేక్‌ టికెట్‌ ప్రివిలేజ్‌ కింద ఇచ్చేలా నిర్ణయించిన టీటీడీ అదే ఏడాది అక్టోబరు నుంచి ఆ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో ఇటీవల దాదాపు రూ.150 కోట్ల విరాళాలు అందాయి. ఈ క్రమంలో శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేసి దర్శనానికి వచ్చే భక్తులకు ఏదైనా ఓ పండును ప్రసాదంగా ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు 400 నుంచి 500 మంది శ్రీవాణి ట్రస్టు దాతలు దర్శనానికి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి దాతకు ఆలయంలో దర్శనం తర్వాత ఓ అరటి పండును ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే గురువారం కూరగాయల దాతలతో సమావేశమైన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అరటిపండ్లలో వివిధ రకాలను టీటీడీకి పంపితే భక్తులకు ప్రసాదంగా అందజేస్తామన్నారు. అరటిపండల్లో మంచి నాణ్యమైన జాతి పండ్లను పంపాలని దాతలను కోరారు. ఈ క్రమంలో కూరగాయల దాతలు కూడా త్వరలోనే అరటిపండ్లను పంపుతామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి దర్శనం తర్వాత శ్రీవారి ఆలయంలోనే శ్రీవాణి ట్రస్టుకు దాతలకు అరటిపండ్లను అందజేయనున్నారు. 

Updated Date - 2021-09-03T06:47:08+05:30 IST