ఆరోపణలపై ఎప్పటికప్పుడు సమాధానం చెప్పండి

ABN , First Publish Date - 2021-10-29T06:55:39+05:30 IST

టీటీడీపై వస్తున్న అరోపణలు, అపోహలపై ఎప్పటికప్పుడు సమాధానమిచ్చి సందేహాలను నివృత్తి చేయాలని ఏపీ శాసన మండలి ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌ కేఈ ప్రభాకర్‌ సూచించారు.

ఆరోపణలపై ఎప్పటికప్పుడు సమాధానం చెప్పండి
టీటీడీ అధికారులతో సమీక్షిస్తున్న కమిటీ చైర్మన్‌ కేఈ ప్రభాకర్‌

టీటీడీకి హామీల అమలు కమిటీ సూచన


తిరుపతి రూరల్‌, అక్టోబరు 28: టీటీడీపై వస్తున్న అరోపణలు, అపోహలపై ఎప్పటికప్పుడు సమాధానమిచ్చి సందేహాలను నివృత్తి చేయాలని ఏపీ శాసన మండలి ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌ కేఈ ప్రభాకర్‌ సూచించారు. టీటీడీలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై గురువారం ఆయన తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో అధికారులతో సమీక్షించారు. టీటీడీ అందిస్తున్న విద్య, వైద్య, ధార్మిక సేవలు, గో ఆధారిత పంటల కొనుగోళ్లు అభినందనీయమన్నారు. టీటీడీ చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు ఇతర దేవాలయాలకూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కరోనా సమయంలో టీటీడీ అందించిన వైద్య సేవలను కొనియాడారు. నలభై రోజుల సుందరకాండ పారాయణం వంటి కార్యక్రమాలు అద్భుతమన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులు రెడ్డి కోరారు. దీనివల్ల కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. టీటీడీ కాలేజీల్లో 4,600 నుంచి 7,200 కు హాస్టల్‌ సీట్లు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ భూముల పరిరక్షణ, ఏడుకొండల్లోని ఎర్రచందనాన్ని మరింత పక్కాగా కాపాడటం, ధార్మిక కార్యక్రమాలను పెంచడం, తిరుపతిలో శ్రీనివాస సేతు వారధి నిర్మాణం పొడిగింపు, పద్మావతి బాలికల స్కూల్‌ తరహాలో మిగతా స్కూళ్ళలోనూ ఇంగ్లీషు మీడియం అమలు చేయాలని కోరారు. ప్రపంచంలోని మేధావులను గుర్తించి శ్రీవారి ఆలయానికి టీటీడీ ఆహ్వానించాలని కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ సూచించారు. టీటీడీ భూముల పరిరక్షణ, టీటీడీ నిర్వహణలో అద్భుతాలు సృష్టించాలన్నారు. ధర్మ పరిరక్షణ, హైందవ భక్తిని పెంపొందించే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నెల్లూరులోని క్లాసికల్‌ లాంగ్వేజ్‌ కాలేజీని టీటీడీనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 


ఏం చేస్తున్నామంటే.. 

టీటీడీ చేస్తున్న విద్య, వైద్య, ధార్మిక కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అదనపు ఈవో ధర్మారెడ్డి కమిటీకి వివరించారు. శ్రీవాణి ట్రస్టు ఏర్పాటుతో శ్రీవారి దర్శన టికెట్ల బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టామన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో తిరుపతిలో గో మహా సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. కలుషితం లేని పంటలు, ఆవు నెయ్యి వంటివి రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. టీటీడీ ఆలయాల్లో నైవేద్యం, ఇతర అవసరాలకు ఆరు వేల క్వింటాళ్ల బియ్యం, ఏడు వేల క్వింటాళ్ల శనగలు, ఆరు వేల క్వింటాళ్ల నెయ్యి, 12 వేల క్వింటాళ్ల బెల్లం అవసరం ఉందన్నారు. గో ఆధారిత వ్యవసాయానికి మొగ్గు చూపే రైతుకు ఒక గోవును ఇస్తామన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటేశ్వరరావు, టీటీడీ జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T06:55:39+05:30 IST