కడప జిల్లావాసుల హల్‌చల్
ABN , First Publish Date - 2021-01-20T06:18:12+05:30 IST
భూమి తమదంటూ కురబలకోట మండలం అంగళ్లులో కడప జిల్లావాసుల దౌర్జన్యం

కురబలకోట, జనవరి 19: వివాదాస్పద భూమిలో కడప జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ప్రవేశించారు. అంగళ్లుకు చెందిన పలువురు అడ్డుకోవడంతో దాడికి పాల్పడిన సంఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. వివరాలివీ.. మండలంలోని అంగళ్లు గ్రామ పరిధిలోని స.నెం.220లో 69.45 ఎకరాల భూమి ఉంది. ఇందులో మూడెకరాలు పిత్రార్జితంగా వచ్చినట్లు అంగళ్లుకు చెందిన సుబహాన్, ఖలీల్, మహమ్మద్ తదితరులు చెబుతున్నారు. ఈ విషయమై సుబహాన్ కుటుంబీకులు, తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన మోహన్ నడుమ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మోహన్ నుంచి భూమిని కొనుగోలు చేశామంటూ కడప జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు మంగళవారం ఈ స్థలంలో ప్రవేశించారు. అక్కడే షామియానా వేసి ఎక్స్‌కవేటర్‌తో చదును పనులు చేపట్టారు. అడ్డుకున్న సుబహాన్ కుటుంబీకులపై దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో మోహన్ వర్గీయులుగా చెబుతున్న కడపవాసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు భూమిని చదును చేసి కంచె ఏర్పాటు చేసి వెనుదిరిగారు. కాగా, ఈ భూమికి సంబంధించి రెండేళ్ల కిందట గొడవలు రేగాయి. అప్పటి ఎస్‌ఐ నెట్టికంఠయ్య ఇరువర్గాలు భూమిలో ప్రవేశించకుండా 145-సెక్షన్ అమలు చేశారు. అనంతరం మోహన్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో, జిల్లా సర్వేయర్ భూమిని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ మేరకు వివాదాస్పద భూమిపై ఉన్న 145-సెక్షన్‌ను పోలీసులు ఎత్తివేయడంతో మళ్లీ వివాదం మొదలైంది. ఈ విషయమై మండల రెవెన్యూ అధికారులు స్పందిస్తూ.. స.నెం.220లో ప్రైవేటు భూమి ఉందనీ, రికార్డుల మేరకు హక్కుదారులు కోర్టు ద్వారా న్యాయం పొందాల్సి ఉందని చెప్పారు.